నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు.
ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన.
ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది.
తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్‌లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన.
ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్‌లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది.
మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్‌లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది.
దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్‌లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు.
నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్‌తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్‌మార్కెట్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.
చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment