Israel-Hamas: భారత్‌ వైఖరిపై ఉత్కంఠ | Hamas Attack On Israel Sets Off Diplomatic Tightrope Walk For India | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం.. భారత్‌ వైఖరిపైనే ఉత్కంఠ

Published Mon, Oct 9 2023 6:44 PM | Last Updated on Mon, Oct 9 2023 8:24 PM

Hamas Attack On Israel Sets Off Diplomatic Tightrope Walk For India - Sakshi

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాజ్‌ దాడులు.. దానికి ఇజ్రాయెల్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా నెత్తురోడుతుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. గాజా స్ట్రిప్‌ నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌లోని నగరాలు, పట్టణాల్లోకి చొరబడ్డ హమాజ్‌ బలగాలు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతోంది.  శనివారం ఉదయం మొదలైన ఈ విధ్వసంలో  మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికీ ఇరు దేశాలకు చెందిన సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా ప్రజలు చనిపోయారు.అనేక సంఖ్యలో గాయపడ్డారు.

కాగా ఇజ్రాయెల్‌, హమాజ్‌ దాడిపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. పలు దేశాలు హమాజ్‌ చర్యను ఖండిస్తూ ఇజ్రాయెల్‌కు మద్దతు నిలుస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం పాలస్తీనియన్ల హక్కులను హరించడం కారణంగానే ఈ యుద్ధం తలెత్తదిందని ఇజ్రాయెల్‌ను నిందిస్తున్నాయి. ఈ క్రమంలో మిడిల్‌ ఈస్ట్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ యుద్ధం భారత్‌ను దౌత్యపరంగా క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టివేసింది. 

ఇజ్రాయెల్‌కు అండగా.. మోదీ ట్వీట్‌
ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌ యుద్ధంపై శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఉగ్రవాద దాడులతో  తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు.  ఈ క్లిష్ట సమయంలో తాము ఇజ్రాయిల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి ఇప్పటి వరకు తమ వైఖరిని వెల్లడించలేదు. ఏ విధమైన ప్రకటన చేయలేదు. కేవలం ప్రధాని ట్వీట్‌ను కేంద్రమంత్రి ఎస్‌ జై శకంర్‌ రీట్వీట్‌ చేశారు. కానీ ప్రధాని మాత్రం ఇజ్రాయెల్‌కు స్పష్టమైన మద్దతు తెలిపారు. 

ఇజ్రాయెల్‌ యుద్ధంపై చైనా స్పందన 
ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య నెల ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందామని చైనా పేర్కొంది. ఇజ్రయెల్‌, చైనా మధ్య నిర్ధిష్ట ద్వైపాక్షిక వివాదాలు లేనప్పటికీ పాలస్తీనా భూభాగంలోని వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్‌ నిర్మాణ కార్యకలాపాలను చైనా వ్యతిరేకించింది. ఇక ఈ హింసాత్మక పరిస్థితులకు ఇజ్రాయెల్‌ అక్రమ ఆక్రమణలే కారణమని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి హెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు.  పాలస్లీనియన్ల హక్కులను, అధికారాలను ఇజ్రాయెల్‌  హరిస్తుంటే ఈ చర్యలు కాకుండా ఇంకేమి ఆశించవచ్చని ఆయన అన్నారు.

న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఇటలీ, యూరోపియన్‌ యూనియన్‌లు భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను ప్రకటించిన ఒక నెల లోపే ఇజ్రాయెల్-గాజా యుద్ధం జరుగుతోంది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్‌కు కౌంటర్‌గా పరిగణిస్తున్న ఈ కనెక్టివిటీ ప్రాజెక్టు వందల ఏళ్ల పాటు ప్రపంచ వాణిజ్యానికిఆధారమని మోదీ పేర్కొన్నారు.

హమాజ్‌ దాడులు.. అమెరికాకు షాక్‌
అరబ్‌లీగ్‌లో బలమైన దేశాల్లో ఒకటి సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్‌ సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో.. హమాస్‌ దాడి చర్చనీయాంశంగా మారింది. హింసపై సౌదీ అరేబియా స్పందిస్తూ.. దాడులను తక్షణం నిలిపివేయాలని  పిలుపునిచ్చింది. అంతేగాక పాలస్తీనియన్ ప్రజల చట్టబద్ధమైన హక్కులను హరించడం ఫలితంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. సౌదీ అరేబియా ప్రకటనతో ఇజ్రాయెల్‌తో సాధారణ సబంధాలు ఏర్పరుచుకునేందుకు సౌదీ అరేబియా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో  ఇజ్రాయెల్‌, సౌదీ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు  తహతహలాడుతున్న అమెరికాకు గట్టి షాక్‌గానే చెప్పవచ్చు.

మెరుగైన భారత్‌ సంబంధాలు
కాగా ద్వైపాక్షిక పర్యటనలు, ఎస్‌పీసీ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ప్రధాని మోదీ సారథ్యంలో భారత్‌ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు  మెరుగయ్యాయి. అంతేగాక సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం మోదీ లభించింది.  జోర్డాన్, ఒమన్, యూఏఈ, పాలస్తీనా, ఖతార్ ఈజిప్టులలో ప్రధాని మోదీ పర్యటనలే మిడిల్‌ ఈస్ట్‌తో భారత్‌ కీలకంగా వ్యవహరించాలనుకుంటున్న తెలియజేస్తున్నాయి ఇక మిడిల్‌ ఈస్ట్‌తో కేవలం వాణిజ్యానికే పరిమితమైన భారత్‌ సంబంధాలు ఇప్పుడు వ్యూహత్మకంగా , రాజకీయంగా కూడా విస్తరించాయి.

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్‌ వైఖరి
భారతదేశం 1950లో మాత్రమే ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించింది. మతం విభజన కారణంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ ఇజ్రాయెల్‌ దేశ ఏర్పాటును వ్యతిరేకించింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ.. అరబ్ దేశాల్లోని తమ స్నేహితుల మనోభావాలను కించపరచకూడదనే కారణంతో భారత్‌ ఇజ్రాయెల్‌ను గుర్తించడం మానుకుందని తెలిపారు. యాసర్ అరాఫత్ నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ (పీఎల్‌వో)కు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ఏళ్ల పాటు ఇజ్రాయెల్‌తో భారత్‌ ‌ సంబంధాలు  అంతమాత్రంగానే ఉండేవి. 

పాలస్తీనా ఉద్యమానికే మద్దతు
ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాలు కూడా పాలస్తీనా ఉద్యమానికి మద్దతునిచ్చాయి. అయితే ఈ మద్దతు స్వదేశంలో విమర్శలకు దారితీసింది ప్రత్యేకించి అరబ్ దేశాలు  1962 భారత్-చైనా యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరించి, 1965, 1971లో జరిగిన యుద్ధాల సమయంలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చాయి.రెండు అంశాలు భారతదేశం మిడిల్‌ ఈస్ట్‌  వ్యూహంలో భారీ మార్పుకు దారితీశాయి. కువైట్‌పై ఇరాక్ దాడి,  సోవియట్ యూనియన్ పతనం, సద్దాం హుస్సేన్‌కు పీఎల్‌వో  మద్దతు,  ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో అలీనోద్యమాన్ని పలుచన చేయడం వల్ల భారత్‌ తన విధానాలను మార్చుకోవలసి వచ్చింది.

బీజేపీ ప్రభుత్వంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలు
ఇక 1992లో ఇజ్రాయెల్‌తో భారత్‌  పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ  ప్రభుత్వంలో సంబంధాలు మరింత బలపడ్డాయి. 1999లో కార్గిల్‌ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ భారతదేశానికి అత్యవసరమై సైనిక సామాగ్రిని అందించడంతో స్నేహితునిగా మారింది. అయితే  బహిరంగంగా భారత్‌ పాలస్తీనా వాదానికి మద్దతునిస్తూనే ఉంది. 2014 నాటికి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే తాము పాలస్తీనా వాదానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.

2018లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు కూడా భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. వెస్ట్ బ్యాంక్‌ను పాలించే ఫతాకు అబ్బాస్ నాయకత్వం వహించాడు. ఇజ్రాయెల్‌పై దాడి జరిగిన గాజా స్ట్రిప్‌పై హమాస్ ఆధిపత్యం చెలాయిస్తోంది.

ఇప్పుడు భారత్‌ స్టాండ్‌ ఏంటి?
ప్రస్తుత హింసాకాండతో భారత్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఎటువైపు తమ మద్దతు తెలిపే విషయంలో స్పష్టత కరువైంది. ఉక్రెయిన్‌పై దాడి సమయంలోనూ భారత్‌ తన వైఖరిని వెల్లడించడంలో తటస్టంగా ఉండిపోయింది. అయితే ఇరు దేశాలు చర్చించుకోవాలని, హింస వల్ల ఏం ఒరగదనే విషయాన్ని  నొక్కి చెప్పింది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పశ్చిమ దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొన్నప్పటికీ.. రష్యా నుంచి భారత్‌ చమురును కొనుగోలు చేసినందుకు తటస్థంగా ఉందంటూ పలు దేశాలు విమర్శించాయి.

అయితే మిడిల్‌ ఈస్ట్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలు (వ్యూహాత్మకం, ఆర్థికం, సాంస్కృతికం, వాణిజ్యం)  ఉన్నందున, ప్రస్తుత సమస్య చాలా క్లిష్టంగా మారింది. అంతేగాక సౌదీ అరేబియా భారత్‌తో నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌ భారత్‌కు అతిపెద్ద ఆయుధ భాగస్వామి. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీటెల్ అవీవ్ మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. ఆయన పర్యటన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తరువాతి ఏడాది భారత్‌ పర్యటనకు సైతం వచ్చాడు.  ఈ క్రమంలో ఎవరికి మద్దతుగా నిలవాలనే విషయంలో భారత్‌ సందిగ్దంలో పడినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement