
బోస్టన్: అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర మంచు తుపానుతో అల్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో రెండు రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. మయిన్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో భారీగా మంచుకురిసింది.
మంచుమయంగా మారిన ఓ రహదారి
న్యూజెర్సీలో 76 సెంటీమీటర్ల మేర, మన్‌హట్టన్ సెంట్రల్ పార్కులో 43 సెంటీమీటర్ల మేర మంచు పడిందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూహాంప్‌షైర్ ఉత్తరభాగంలో అడుగు మేర మంచు పేరుకుపోయింది. మంచు కారణంగా న్యూజెర్సీలో 661 వాహన ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వచ్చే రెండు వారాలపాటు ఇవే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు.



