ఆకాశంలో చుక్కల ముగ్గేసినట్లు నక్షత్రాలు.. మధ్యలో ఒక్కసారిగా పేలిన కొలిమా అగ్ని పర్వతం.. ఫొటో సూపర్‌గా ఉంది కదూ.. ఈ చిత్రాన్ని హెర్నాండో రివేరా అనే ఫొటోగ్రాఫర్ తీశారు. గతంలో మెక్సికోలోని కొలిమా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఓ రాత్రంతా అక్కడే ఉండి ఫొటోలను తీసినట్లు రివేరా తెలిపారు. ఒక్కోసారి ప్రకృతి విధ్వంసం కూడా కెమెరా కంటికి చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్న రివేరా ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు.
భారీ డ్రోన్‌తో ఉపగ్రహ ప్రయోగాలు
ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే బోలెడంత ఖర్చు. ఇస్రో లాంటి సంస్థలైతే చౌకగానే ఆ పనిచేస్తున్నాయి గానీ.. మిగిలిన చోట్ల మాత్రం ఒక్కో ప్రయోగానికి రూ.400 కోట్ల నుంచి రూ.వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. ఇలా కాకుండా.. భారీ డ్రోన్ సాయంతో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుస్తానని అమెరికాకు చెందిన ఏవియమ్ అనే కంపెనీ చెబుతోంది. ‘రావన్ ఎక్స్’పేరుతో ఇటీవలే ఈ కంపెనీ ఓ డ్రోన్‌ను సిద్ధం చేసింది కూడా. పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే ఈ డ్రోన్ గాలిలో నుంచే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు. 80 అడుగుల పొడవు.. రెక్కల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 18 అడుగుల వరకు ఉంటుంది. సాధారణ విమాన ఇంధనాన్ని వాడుకుని 1.6 కిలోమీటర్ల రన్‌వే నుంచే నింగిలోకి ఎగరగలదు. 8 వేల చదరపు అడుగుల స్థలమున్న హ్యాంగర్‌లో ఉంచేయవచ్చు.
ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని వాడుకోవచ్చని, డ్రోన్‌లో 70% మళ్లీ మళ్లీ వాడుకునేలా తయారు చేశామని కంపెనీ సీఈవో జే స్కైలస్ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ మొత్తాన్ని పలుమార్లు వినియోగించుకునేలా చేస్తామని చెప్పారు. రావన్ ఎక్స్‌తో ఒక్కో ఉపగ్రహ ప్రయోగం 3 గంటల్లో పూర్తవుతుందన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుందని, అమెరికా స్పేస్ ఫోర్స్‌తోపాటు, ఇతర సంస్థలు వినియోగదారులుగా ఉన్నారని వివరించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్ ఆస్లోన్–56 పేరుతో భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment