న్యూఢిల్లీ: రష్మి సమంత్ ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రష్మి సమంత్ సోషల్ మీడియా వేదికగా కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, కర్ణాటకకు చెందిన సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ జరిగిన ఎన్నికలలో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ పరిధిలోని ఒక కాలేజ్‌లో ఎమ్మెస్సీ ఇన్ ఎనర్జీ సిస్టమ్ కోర్సు చేస్తున్నారు రష్మి సమంత్.
యూనివర్సీటిలో ఎన్నికల్లో పోటి చేసిన రష్మి సమంత్.. కాలేజీలో ఆమె గ్రూపు రాజకీయాలు లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. రష్మి ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఆమెనే తమ నాయకురాలిగా ఎన్నుకొన్నారు. ప్రెసిడెంట్ పదవికి నలుగురు పోటీ చేస్తే, మిగతా ముగ్గురికీ పోలైన మొత్తం ఓట్ల కన్నా రష్మి సమంత్‌కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఇక ఈ గెలుపు సంబరాలు ఎంతో సేపు నిలవలేదు. ఆక్స్‌ఫర్డ్ క్యాంపెయిన్ ఫర్ రేసియల్ అవేర్‌నేస్ అండ్ ఈక్వాలిటీ(సీఆర్‌ఈఏ) సంస్థ, గతంలో రష్మి సమంత్ సామాజిక మాధ్యమాల వేదికగా అనేక జాత్యహంకార వ్యాఖ్యలున్న పోస్టులు పెట్టినట్లు ఆరోపించింది.
2017 జరిగిన బెర్లిన్ హోలో కాస్ట్ మెమోరియల్‌ను సందర్శించిన నేపథ్యంపై కూడా రష్మి సమంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్‌ల పై విమర్శలు వచ్చాయి. 2021లో జరిగిన ఒక ఈవెంట్‌లో ఒక సంస్థ స్కాలర్‌షిప్ గురించి సమంత్.. ‘హిట్లర్ ఫండ్’, ‘హిట్లర్ స్కాలర్‌షిప్’ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. దీనికి మీరు అంగీకరిస్తారా..’ అని రష్మి సమంత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వివాదస్పదమైంది. ఇలా వరుస ఆరోపణలు, విమర్శలు ఈ క్రమంలో రష్మి సమంత్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన విద్యార్థులందరికి ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామల నేపథ్యంలో ఈ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ‘నా మాటలు, చర్యలు ఎవరినైన బాధించి ఉంటే క్షమపణలు కొరుతున్నాను’ అన్నారు రష్మి సమంత్.
Comments
Please login to add a commentAdd a comment