వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటే సెయింట్ లూయిస్ జైల్లో ఖైదీలు శనివారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల పరామర్శకు వచ్చే బంధువులను పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఖైదీల కేసుల్లో కోర్టు విచారణలు సైతం నిలిపివేశారు. దీంతో వారంతా అసహనానికి గురయ్యారు. జైలు నాలుగో అంతస్తులో కిటికీలను, పైప్‌లను ధ్వంసం చేశారు. కుర్చీలు, మంచాలు, పరుపులకు నిప్పు పెట్టారు. జైలు అధికారులతో ఘర్షణకు దిగారు.
వారిని శాంతింపజేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఉదయం 10 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అర్పివేశారు. ఈ జైల్లో 633 మంది ఖైదీలు ఉండగా, దాదాపు 115 మంది బీభత్సం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఘటనలో ఖైదీలెవరూ గాయపడలేదు. ఓ అధికారి స్వల్పంగా గాయపడగా, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సెయింట్ లూయిస్ జైలు నుంచి 65 మంది ఖైదీలను డౌన్‌టౌన్ జైలుకు తరలించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అదనపు చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment