బీజింగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం పెద్ద యుద్ధంగా పరిణామం చెందకుండా చైనా సహకారాన్ని కోరుతూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మరుసటి రోజే చైనా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడ్డాయి.
"పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ఎవరూ ఎటువంటి చర్య తీసుకోకూడదు. వీలైనంత త్వరగా చర్చల దిశగా అడుగులు వేయాలి." అని వాంగ్ యి సౌదీ విదేశాంగ మంత్రితో ఈ మేరకు మాట్లాడారు. కాగా.. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని ముగించడానికి, కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం పశ్చిమాసియాను సందర్శించనున్నారు.
పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి తన పాత్రను పోషించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య ముగియడానికి ఏకైక మార్గం ఇరుదేశాలు చర్చలను ప్రారంభించడమేనని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలో సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం టూ- స్టేట్ ఫార్ములాగా పేర్కొన్న చైనా.. పాలస్తీనా స్వతంత్రానికి పిలుపునిచ్చింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చైనా స్పందన సరిగా లేదని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. చైనా ప్రకటన అసత్యంగా ఉందని ఆరోపించింది. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచించకుండా ప్రకటన వెలువరించిందని తెలిపింది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు
Comments
Please login to add a commentAdd a comment