అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిలో ఇద్దరిని అల్ షిఫా ఆస్పత్రిలోకి లాక్కెళ్తున్న హమాస్ మిలిటెంట్లు. సంబంధిత వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బయటపెట్టింది.
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిని దిగ్బంధించి, రోజుల తరబడి తనిఖీలు చేస్తూ హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది.
ఈ దాడిలో ఆసుపత్రి రెండో అంతస్తు ధ్వంసమైంది. కనీసం 12 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇండోనేíసియన్ హాస్పిటల్‌కు 200 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ షార్ప్ షూటర్లు మాటు వేశారు. ఆసుపత్రులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ తేలి్చచెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 13,000కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈజిప్టుకు 28 మంది శిశువులు
అల్–షిఫా నుంచి దక్షిణ గాజాలోని అల్–అహ్లీ ఎమిరేట్స్ హాస్పిటల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందిని సోమవారం అంబులెన్స్‌ల్లో ఈజిప్టుకు చేర్చారు. వారికి ఈజిప్టు వైద్యులు సాదర స్వాగతం పలికారు. శిశువుల కోసం ఇంక్యుబేటర్లు సిద్ధంగా ఉంచారు. ఈజిప్టులో వారికి మెరుగైన చికిత్స అందించనున్నారు. శిశువుల్లో కొందరిని గాజా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని అల్–అరిష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరికొందరిని కైరోకు తరలించారు. వీరంతా అల్–షిఫాలోనెలలు నిండక ముందు జని్మంచి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారే. 31 మందిలో 28 మందిని ఈజిప్టుకు తరలించారు. మిగతా ముగ్గురు గాజాలోనే ఉండిపోయారు.
అల్–షిఫాలో బందీలను దాచిపెట్టిన హమాస్!
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వారిలో చాలామందిని అల్–షిఫా ఆసుపత్రి కింది భాగంలోని సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారలను తాజాగా బయటపెట్టింది. అల్–షిఫాలో అక్టోబర్ 7న నిఘా కెమెరా చిత్రీకరించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో ఇద్దరు బందీలను అల్–షిఫాలోకి మిలిటెంట్లు బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ థాయ్‌లాండ్, నేపాల్ జాతీయులు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. ఇదిలా ఉండగా, బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వారిని విడుదల చేసేలా హమాస్‌ను ఒప్పించేందుకు అమెరికా అభ్యర్థన మేరకు అరబ్ దేశాలు రంగంలోకి దిగాయి. మిలిటెంట్ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment