వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తన సందేశంలో గాజాపై ఇజ్రాయెల్ హేయ దాడులను ప్రస్తావించారు. పాలస్తీనియన్ల అపార ప్రాణనష్టానికి హేతువైన ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రధాన బాల్కనీ నుంచి సోమవారం పోప్ తన సందేశం వినిపించారు. ‘‘ గాజా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో బాలలు కన్నుమూస్తున్నారు.
వారంతా నేటి తరం బాల యేసులు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అక్కడి అమాయక పౌరుల నెత్తుటి పంట పండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్ మెరుపుదాడి దారుణం. నాడు అపహరించుకుపోయిన వారందర్నీ హమాస్ విడిచిపెట్టాలి. ప్రపంచ ఆయుధ విపణి యుద్ధవీణ తంత్రులను మోగిస్తోంది. గాజా, ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లలో సైనిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు సమసిపోవాలి.
ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కులు పరిరక్షించబడాలి. గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి దారులు తెరచి మానవీయ సంక్షోభాన్ని నివారించాలి’’ అని పోప్ వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆయుధ కొనుగోళ్లపై స్పందించారు. ‘‘ఆయుధాల ఉత్పత్తి, కొనుగోలు, రవాణా ఊహకందనంత పెరిగిన ఈ తరుణంలో కనీసం శాంతి అన్న పదం మనం ఉచ్ఛరించగలమా?’’ అని పోప్ ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment