రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది.
దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు.
నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు.
చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
Comments
Please login to add a commentAdd a comment