వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి తప్పులో కాలేశారు. బాల్టిమోర్ లోని కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం పొల్యూషన్(కాలుష్యం) తగ్గించుకుంటే భావితరాలు బాగుంటాయని చెప్పడానికి బదులు మనం పాపులేషన్(జనాభా) తగ్గించుకుంటే బాగుంటుందని నోరు జారారు. ఈ ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో కమలా హారిస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీ వారు నిర్వహించిన వాతావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(58) ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కార్యక్రమం పట్ల కొంచెమైనా అవగాహన లేకుండా హాజరైన ఆమె వైట్ హౌస్ వర్గాలు ఇచ్చిన స్క్రిప్తును యధాతధంగా చదివేశారు. వారిచ్చిన స్క్రిప్టులో మొదట పాపులేషన్ అని రాసి దాన్ని సరిచేస్తూ పక్కన బ్రాకెట్లో మళ్ళీ పొల్యూషన్ అని రాశారు. అయినా కూడా కమలా హారిస్ ప్రసంగ ప్రవాహంలో పొల్యూషన్ కి బదులు పాపులేషన్ అని చదివి కొత్త తలనొప్పని తెచ్చుకున్నారు.
ప్రసంగం ఆమె మాటల్లో..
ఎలెక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తూ స్వచ్ఛమైన ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి "జనాభాను తగ్గిస్తే" భావితరాలు స్వచ్ఛమైన వాయువును పీల్చుకుంటారని, పారిశుద్ధ్యమైన మంచినీరు తాగుతారని అన్నారు.
ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి జనాభాను తగ్గించడమేమిటని అక్కడివారు చాలాసేపు జుట్టు పీక్కున్నారు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత గానీ వారికి అర్ధం కాలేదు.. కమలా హారిస్ పొరపాటుగా చదివారని.. ఆమె ఉద్దేశ్యం తగ్గించాల్సింది జనాభాని కాదు కాలుష్యాన్నని. తరవాత వైట్ హౌస్ వర్గాలు ఆమె ప్రసంగానికి సంబంధించిన కాపీని ప్రెస్ కు రిలీజ్ చేశారు. అందులో పాపులేషన్ పదాన్ని కొట్టేసి పొల్యూషన్ అని స్పష్టంగా రాశారు. అలవాటులో పొరపాటుగా ఆమె అదే చదివేశారు.
ఇంకేముంది విమర్శకులు వారి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. అసలు పుట్టేవాళ్లే తక్కువగా ఉంటే.. జనాభా తగ్గించమంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా అప్పుడప్పుడూ అర్ధజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విషయపరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పదేపదే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె ఓ సారి కార్మికుల యూనియన్, పౌర హక్కుల నాయకుల సభలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) గురించి ప్రస్తావిస్తూ ఏఐ అంటే అది రెండక్షరాలు, యాంత్రిక సాయంతో అభ్యసించేదని అర్ధం అని చెప్పి తీవ్ర విమర్శల పాలయ్యారు.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు..
Comments
Please login to add a commentAdd a comment