ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు 19వ రోజు కూడా విరుచుకుపడుతున్నాయి. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. సైనిక స్థావరాలనే కాదు.. జనావాసాలను కూడా విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలో పుతిన్ చెప్పినా.. రష్యా సైన్యం వినకుండా దాడులతో ముందుకెళ్తోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం కూడా రష్యా సైన్యం.. ఉక్రెయిన్ పశ్చిమదిశలో ఉన్న అర్బన్ ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ముందుకు వెళ్తోందని దిమిత్రి వెల్లడించారు. అయితే.. ప్రధాననగరాలపై దాడులను ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బలగాలను సూచించారని దిమిత్రి పేర్కొన్నారు. రష్యా బలగాల దాడుల్లో.. భారీగా ఉక్రెయిన్ పౌరులు బలి అవుతున్నారని.. ముఖ్యంగా జనాభా ఉన్న పెద్ద నగరాలపై దాడులను తక్షణమే ఆపాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు దిమిత్రి మీడియాకు వెల్లడించారు. అయితే రష్యా రక్షణశాఖ మాత్రం.. పుతిన్ సూచనను లైట్ తీస్కుందట.
దాదాపు ప్రధాన నగరాలను చుట్టిముట్టేసినట్లు.. వాటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధ్యక్ష భవనానికి తెలియజేశాయి రష్యా బలగాలు. అంతేకాదు ప్రాణ నష్టం వాటిల్లకుండానే ముందుకు వెళ్తామని, అవసరమైతే సేఫ్ కారిడార్‌ల ద్వారా ఉక్రెయిన్ పౌరులను, ఇతర దేశీయులను తరలించేందుకు ప్రయత్నిస్తామని రష్యా బలగాలు హామీ ఇచ్చాయని దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
పనిలో పనిగా.. పాశ్చాత్య దేశాలపై విరుచుకుపడ్డారు దిమిత్రి పెస్కోవ్. పాశ్చాత్య దేశాల రెచ్చగొట్టే చర్యల వల్లే ఇదంతా అని మండిపడ్డారాయన. ఈ దాడుల్లో జరిగే ప్రాణ నష్టానికి.. రష్యాను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు.
చైనా సాయం.. తూచ్!
ఇదిలా ఉండగా.. రష్యా చైనా సాయం కోరుతోందన్న కథనాలపై క్రెమ్లిన్ స్పందించింది. రష్యా బలగాలు చైనా సాయం తీసుకుంటున్నాయన్న వార్తలను క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తోసిపుచ్చారు. రష్యాకు తనదైన సొంత సామర్థ్యం ఉందని.. ఎవరి సాయం లేకుండానే ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment