
కొలంబో: ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువులు లేక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంధన నిల్వలు పూర్తిగా అడుగంటాయి. విదేశీ మారకపు నిల్వలు కూడా ఖాళీ కావడంతో దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇంధనం గురించి శ్రీలంక ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది.
పెట్రోల్ కొనేందుకు కావాల్సినంత విదేశీ మారకద్రవ్యం కూడా అందుబాటులో లేదంటూ శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ కారణంగా నెలన్నరకు పైగా తీరంలో ఉన్న నౌక నుంచి పెట్రోల్ కొనలేకపోతున్నట్టు ఇంధన మంత్రి కంచన విజెశేకర పార్లమెంటుకు తెలిపారు. ‘‘ఆ నౌక నుంచి జనవరిలో కొన్న పెట్రోల్‌కే ఇంకా 5.3 కోట్ల డాలర్లు కట్టాల్సి ఉంది. ఆ బాకీ కట్టేస్తామని శ్రీలంక సెంట్రల్ బ్యాంకు హామీ ఇచ్చినా ప్రస్తుత షిప్‌మెంట్‌కు చెల్లింపులు జరిపితేనే పెట్రోల్ విడుదల చేస్తామని షిప్పింగ్ కంపెనీ చెప్పింది’’ అంటూ వాపోయారు.
‘‘మరో మూడు రోజుల్లో పెట్రోల్ కొనుగోలు చేస్తాం. అప్పటిదాకా దయచేసి పెట్రోల్ కోసం బంకుల ముందు బారులు తీరొద్దు. ఈ పరిస్థితికి మమ్మల్ని క్షమించాలి’’ అని ప్రజలను అభ్యర్థించారు. ప్రపంచ బ్యాంకు నుంచి 16 కోట్ల డాలర్ల గ్రాంటు అందిందని ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించినా, ఆ మొత్తాన్ని పెట్రోలు కొనుగోలుకు వాడేందుకు నిబంధనలు అంగీకరించవు.
చదవండి: పాక్ అణు విస్తరణ కొనసాగింపు: యూఎస్‌ఏ
Comments
Please login to add a commentAdd a comment