130 మిలియన్‌ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు | Luxury Jet Spurned By Mexico Unsold From US | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి మెక్సికోకు తిరిగి వచ్చిన లగ్జరీ జెట్‌​

Published Fri, Jul 24 2020 2:34 PM | Last Updated on Fri, Jul 24 2020 6:44 PM

Luxury Jet Spurned By Mexico Unsold From US - Sakshi

మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్‌ ‘బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్’‌ను అమ్మడానికి మెక్సికన్‌ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు‌ కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అ‍మ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్‌ చానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్‌ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్‌రూమ్‌లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్‌ సూట్‌, ప్రైవేట్‌ బాత్‌ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం)

ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్‌ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్‌ ఒబ్రాడోర్‌ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్‌ ఒబ్రాడోర్‌ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్‌ కోసం 120 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్‌ ఆఖరి క్షణాలు....)

ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్‌లో ఓ రాఫెల్‌ విమానం కూడా ఉన్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement