లిమా, పెరూ: పెరూ దేశంలోని మచు పిచ్చు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మచు పిచ్చు కూడా మూత పడింది. అయితే ఈ పర్యాటక ప్రాంతాన్ని కేవలం ఒక్కడి కోసం తెరిచారు. అయితే అతడేమైనా అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీనా అంటే అది కాదు. మరి ఏంటా ఆ వ్యక్తి ప్రత్యేకత అంటే ఓ సారి ఇది చదవండి.. జపాన్‌కు చెందిన బాక్సింగ్ ట్రైనర్ జెస్సీ కటయామా అనే వ్యక్తి మచు పిచ్చు గంభీర పర్వత శిఖరం చూడాలని భావించాడు. దాంతో మార్చిలో పెరూ చేరుకున్నాడు. అయితే దురదృష్టం కొద్ది కోవిడ్ వ్యాప్తి పెరగడం.. లాక్‌డౌన్ విధించడం వెంటవెంటనే జరిగాయి.
పాపం మూడు రోజుల పర్యటన నిమిత్తం పెరూ చెరుకున్న జెస్సీ ఏకంగా ఆరు నెలల పాటు అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో తన పరిస్థితి గురించి స్థానిక మీడియాకు తెలియజేశాడు. అది కాస్త పర్యాటక అథారిటీకి చేరడంతో ప్రత్యేక అనుమతితో అతడిని మచు పిచ్చు సందర్శించేందుకు అంగీకరించారు పెరూ అధికారులు. దాంతో అతడి కల నిజమయ్యింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి మచు పిచ్చుని దర్శించిన మొదటి వ్యక్తిని నేనే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక అధికారులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ స్థానిక టూరిజం అథారిటీ ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: దొంగల గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?)
16 వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమణకు ముందు పశ్చిమ దక్షిణ అమెరికాలో 100 సంవత్సరాల పాటు పాలించిన ఇంకా సామ్రాజ్యపు శాశ్వతమైన వారసత్వం మచు పిచ్చు. ఇంకా సెటిల్మెంట్ శిధిలాలను 1911 లో అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బింగ్హామ్ తిరిగి కనుగొన్నారు. ఆ తర్వాత 1983 లో యునెస్కో మచు పిచ్చును ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ముసి వేసిన మచు పిచ్చును మొదట జూలైలో తిరిగి తెరవాలని నిర్ణయించారు. కానీ అది నవంబర్‌కు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment