ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు.
ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన.
మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది.
సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment