Malawi
-
విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ దుర్మరణం
బ్లాంటైర్: ఆఫ్రికా దేశం మలావీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ షిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దేశ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించినట్లు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం వెల్లడించారు.ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని అన్నారు. ఉపాధ్యక్షుడు షిలిమా సహా మొత్తం 10 మంది సోమవారం ఉదయం సైనిక విమానంలో మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజుజు సిటీకి బయలుదేరారు. ముజుజులో ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో వెనక్కి వెళ్లాలని విమానం పైలట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమాచారం ఇచ్చారు. 45 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. -
మలావీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం
లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. -
మలావీ ఉపాధ్యక్షుడి ఎయిర్‌క్రాఫ్ట్ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది. సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది. -
గాంధీజీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ
లిలాంగ్వే, మలావి : తూర్పు ఆఫ్రికా దేశమైన మలావి వాణిజ్య రాజధాని కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. గాంధీజీ.. తన జీవితంలో ఎక్కువ కాలం జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికే వెచ్చించారని, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాజధానిలో నిర్మించడం సబబు కాదని..‘ గాంధీ మస్ట్ ఫాల్’ గ్రూప్ సభ్యులు కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా.. ‘నల్లజాతీయులైన తమకు గాంధీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు సరికదా, ఆ భావన మాలో మరింత బలంగా నాటుకుపోయింది’ అంటూ మరో పద్దెనిమిది అభ్యంతరాలతో కూడిన లేఖను కోర్టుకు అందజేశారు. సుమారు 3 వేల మంది మలావియన్స్ సంతకం చేసిన ఈ లేఖను, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆఫ్రికా దేశాల్లో గాంధీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. 2016లో ఘనాలోని ఓ యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఘనా ప్రభుత్వం ప్రయత్నించగా.. గాంధీజీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరో చోట విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించింది. శాంతి, అహింసా మార్గాలతో భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసేందుకు తన జీవితాన్ని ధారపోసిన గాంధీజీ.. తొలి ఉద్యమం దక్షిణాఫ్రికాలో మొదలైందన్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశాల్లోని కొంతమంది ప్రజలు మాత్రం ఆయనను ఓ జాత్యహంకారిగా, తమ మధ్య విభేదాలు సృష్టించిన వ్యక్తిగా ద్వేషిస్తూ ఉంటారు. -
ఆమె పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
లైలాంగ్వే: బాల్య వివాహాలపై ఆమె ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతమంది ఎదురువచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆగ్నేయ ఆఫ్రికా లోని భూపరివేష్టిత దేశం మాలావి. థెరిసా కచిండమోటో సాధారణ గిరిజన మహిళగా ఉండాలనుకోలేదు అందుకే అక్కడ ఆమె ఓ శక్తిగా మారింది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, ఆచరాలకు అడ్డుకట్ట వేయడానికి నిరంతరం కృషిచేశారు. మూడేళ్ల కాలవ్యవధిలోనే 850కి పైగా బాల్య వివాహాలను ఆమె అరికట్టారు. 9 లక్షలకు పైగా జనాభా ఉండే డేడ్జా జిల్లాకు ఆమె అనధికారిక పరిపాలకురాలు. అక్కడ ఆమె ఓ వ్యవస్థగా మారిపోయారు. బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉన్న 20 దేశాలలో ఎనిమిదో స్థానంలో మాలావి ఉంది. డేడ్జా జిల్లాలో 50 మంది అధికారులకు ఆమె నియమించి బాల్య వివాహాలు అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచలోనే బాల్య వివాహాల ర్యాంకులలో మాలావి టాప్ టెన్ లో ఉంటుంది. అక్కడ 15 ఏళ్ల వయసున్న ప్రతి 8 మంది బాలికలలో ఇద్దరిది బాల్యవివాహమే. వివాహ చట్టాన్ని తీసుకువచ్చి ఏజ్ లిమిట్ నిబంధనలు అమలుకోసం ప్రయత్నించి సక్సెస్ సాధించారు. 2015లో వివాహ వయసును 18 ఉండేలా చట్టాలను తీసుకొచ్చారు. అక్కడి వారికి ఆమె ఓ ఐకాన్ గా నిలుస్తున్నారు. బాలికల పాలిట ఆమె నిజంగానే దేవతగా మారారు. బాలికలను చదివిస్తే వారే భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటారని ఆమె పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో చెబుతూ ఎంతో మందిని ఇందులో భాగస్వాములయ్యేలా చేశారు. -
బస్సు - ట్రక్ ఢీ: 13 మంది మృతి
హరారే: జింబాబ్వేలో హరారే - నయంపండ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సు - భారీ ట్రక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వ రవాణ సంస్థకు చెందిన బస్సు మలావీ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. గత వారంలో మాస్వింగో - బైట్ బ్రిడ్జ్ జాతీయ రహదారిపై బస్సు, ట్రక్ ఢీ కొన్న ఘటనలో 19 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని పోలీసులు గుర్తు చేశారు.