ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు కొంత మంది కలిసి తలా ఇంత సొమ్ము సర్దడం, ఆ మేరకు వారందరికీ వాటాలు ఉండటం కామనే. కానీ ఓ వ్యక్తి తనను తానే వాటాలు వేసి అమ్మేసుకుంటే..?డబ్బులిచ్చి వాటాలు తీసుకున్నవారు చెప్పినట్టుగా తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే..? ఇదేదో చిత్రంగా ఉంది అనిపిస్తోందా.. మరి ఈ కథేమిటో తెలుసుకుందామా..
కంపెనీ ఎందుకు.. తానే ఉండగా..!
ఆయన పేరు మైక్ మెరిల్. అమెరికాలోని పోర్ట్‌లాండ్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ‘టెక్ సపోర్ట్, వెబ్3 డెవలప్‌మెంట్’ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు 2008లో ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. కంపెనీలు, షేర్లు ఎందుకుగానీ.. తనకు తానే ఓ కంపెనీగా చేసుకుని, తన జీవితాన్నే షేర్లుగా మార్చి అమ్ము కోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేం.. తన జీవితాన్ని ఓ లక్ష షేర్లుగా మార్చి, ఒక్కో షేర్‌కు ఒక డాలర్ రేటు నిర్ణయించాడు. ఈ విషయాన్ని మిత్రులకు, బంధువులకు చెప్పాడు, సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశాడు.
చదవండి: అత్యంత ఆసక్తిదాయక స్థలమిదే
ప్రత్యేకంగా వెబ్‌సైట్ పెట్టి మరీ..
తన జీవితం షేర్లను కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ వెబ్‌సైట్ కూడా పెట్టాడు. కీలక విషయాల్లో తాను ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ వెబ్‌సైట్లోనే ప్రశ్నలు పెడతాడు. ఎక్కువ మంది షేర్ హోల్డర్లు దేనికి ఓటేస్తే.. ఆ నిర్ణయం తీసుకుంటాడన్న మాట. ఆ రోజు తాను ఏ డ్రెస్సు వేసుకోవాలన్న దగ్గరి నుంచి ఉద్యోగంలో ఉండాలా, మానేయాలా అనే దాకా చాలా నిర్ణయాలు షేర్ హోల్డర్ల అభిప్రాయం మేరకే తీసుకుంటాడు. తాను వెజిటేరియన్‌గా మారాలనుకుంటే షేర్ హోల్డర్లు ఓకే చేశారు. నిద్ర సమయాలు మార్చుకోవాలనుకుంటే ఓకే చేశారు. చిత్రంగా తాను వేసెక్టమీ చేయించుకుంటానంటే మాత్రం ‘నో’చెప్పారు.
ఇష్టంలేకున్నా చేయాల్సి వస్తోంది!
‘‘నన్ను నేను షేర్లు చేసి అమ్మేసుకున్నాక.. షేర్ హోల్డర్లు చెప్పినట్టే చేయాలి. చాలాసార్లు నాకు ఇష్టం లేకున్నా.. వారు చెప్పినట్టు చేయాల్సి వస్తోంది. అయితే ప్రతిసారీ దానివల్ల మంచే జరుగుతోంది..’’అని మైక్ మెరిల్ చెప్తున్నారు.
రేటు పెరుగుతూ.. తగ్గుతూ..
2008లో మైక్ మెరిల్ ఇలా జీవితాన్ని షేర్లలా అమ్ముతున్న ప్రకటన చేసినప్పుడు పెద్దగా స్పందన రాలేదు. మొదటి పది రోజుల్లో బంధువులు, స్నేహితులు సరదాకి షేర్లు కొన్నారు. అలా మొత్తం లక్ష షేర్లకుగాను.. 929 షేర్లు మాత్రమే అమ్మాడు. సాధారణంగా ఎక్కువ షేర్లు ఉన్నవారికి నిర్ణయాల్లో ఎక్కువ హక్కు ఉంటుంది. 99శాతం వాటా తన వద్దే ఉండటంతో మైక్ మెరిల్ పద్ధతి మార్చాడు. తన దగ్గర ఉన్న వాటాకు ఓటింగ్ హక్కులు తొలగించుకున్నాడు. బయటివారి వద్ద ఉన్న షేర్ల సంఖ్య లెక్కనే.. వారు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఇది మెల్లగా ఆ నోటా ఈ నోటా మీడియాలో పడి అప్పట్లో వైరల్‌గా మారింది. దీనితో మైక్ మెరిల్ లైఫ్ షేర్లకు డిమాండ్ పెరిగింది.
ఇప్పటివరకు బయటి వ్యక్తులు 14,924 షేర్లు కొన్నారు. ఒక సమయంలో షేర్ ధర 18 డాలర్లు దాటింది. అంటే మైక్ మెరిల్ విలువ ఆ రోజున 12 లక్షల డాలర్లకు చేరినట్టుగా లెక్కించారు. మన కరెన్సీలో రూ.9.94 కోట్లు అన్నమాట.
ఆయన గురించిమీడియాలో వైరల్‌గా
మారినప్పుడల్లా కొందరు షేర్లు కొనేందుకు ఆసక్తి చూపడంతో ధర పెరగడం.. తర్వాత అమ్మేయడంతో ధర తగ్గడం జరుగుతూ వస్తోంది. అంటే మైక్ మెరిల్ ధర పెరుగుతూ, తగ్గుతూ ఉంటోంది. ప్రస్తుతం మైక్ మెరిల్ షేర్ ధర ఐదారు డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment