
ప్రపంచం కుబేరుడు ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతు చిక్కని వ్యూహాలు అమలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆయన మరోసారి తన శైలిలోనే ప్రవర్తించారు. టెస్లా కంపెనీలో తన షేర్లలో కొన్నింటినీ అమ్మకానికి పెట్టారు.
అడిగి మరీ
సెలబ్రిటీ బిలియనీర్ ఎలన్ మస్క్‌కి ట్విట్టర్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. సుమారు 63 మిలియన్ల మంది అతని అకౌంట్‌ని ఫాలో అవుతున్నారు. ఈ నెల మొదటి వారంలో అకస్మాత్తుగా తన కంపెనీ షేర్లలో పది శాతం అమ్మాలని అనుకుంటున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. అమ్మాలా ? వద్దా చెప్పాలంటూ తన ఫాలోవర్లు కోరాడు. సుమారు 3.5 మిలియన్ల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొనగా.. సుమారు 58 శాతం మంది యూజర్లు షేర్లు అమ్మేయాలంటూ సూచించారు.
అమ్మేశాడు
ట్విట్టర్ పోల్‌లో వ్యక్తమైన అభిప్రాయాన్ని అనుసరిస్తూ నిజంగానే తన షేర్లను అమ్మకానికి పెట్టారు ఎలన్ మస్క్. ఈ మేరకు అమెరికా స్టాక్ మార్కెట్‌లో షేర్ల అమ్మకానికి సంబంధించి ఫారమ్ 4ని దరఖాస్తు చేశారు. సుమారు 1.10 బిలియన్ డాలర్ల విలువ చేసే 9,30,000 షేర్లు నవంబర్ 8న అమ్మేశారు. అంతేకాదు మరో 2.15 షేర్లు సైతం అమ్మేందుకు రెడీ అయ్యారు. టెస్లాలో ఎలన్ మస్క్‌కి ఏకంగా 3.6 మిలియన్ షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల విలువ సుమారు 5 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీలకు మేజర్ షేర్ హోల్డర్‌గా ఉన్న ఎలన్ మస్క్ సంపద ఫోర్బ్స్ జాబితా ప్రకారం 300 బిలియన్ డాలర్లుగా ఉంది.
BREAKING: Tesla has filed a Form 4 for Elon Musk with the SEC.
— Sawyer Merritt 📈🚀 (@SawyerMerritt) November 10, 2021
Link: https://t.co/Cbuqk59AaF pic.twitter.com/YbQW3xG8nZ
కారణం అదేనా
ఇటీవల వాషింగ్టన్‌లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.