![Tesla And Twitter Stock Fall Due To Elon Musk Twitter Deal Cancelled - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/12/twitter_tesla.jpg.webp?itok=yT2h38p1)
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌పై కోర్టుకు వెళ్లడంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ న్యాయపోరు ఓ కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్విటర్, టెస్లా షేర్లు సోమవారం గణనీయంగా క్షీణించాయి. ట్విటర్ షేరు ఒక దశలో 8 శాతం పైగా తగ్గి 33.71 డాలర్లకు, టెస్లా 6 శాతం పైగా క్షీణించి 706.25 డాలర్ల స్థాయికి పడిపోయాయి. వివాదం వివరాల్లోకి వెడితే షేరు ఒక్కింటికి రూ. 54.20 డాలర్ల రేటు చొప్పున 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ కొన్నాళ్ల క్రితం మస్క్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ డీల్ రద్దు చేసుకుంటే ఆయన 1 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, నకిలీ ఖాతాల లెక్క సరిగ్గా చెప్పడం లేదని ఆరోపిస్తూ ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఈమధ్య ప్రకటించారు. కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించినప్పట్నుంచీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ట్విటర్ .. ఈ తాజా ప్రకటనపై మండిపడింది. తాము అన్ని వివరాలు సరిగ్గానే ఇచ్చినప్పటికీ మస్క్ కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment