మూగ జీవాలకు సాయం చేయడం.. అది వైరల్ కావడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, మనుషుల్ని చంపి పీక్కుతినే జీవికి సాయం చేయడం.. అదీ మూడురోజులు ఓపికగా ఎదురు చూడడమే ఇక్కడి ఘటనలో విశేషం. స్థానికులంతతా ముద్దుగా ‘మువాయ కలంగ్ బన్’.. అని పిలుచుకునే ఆ మొసలికి ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఆ మూగ జీవికి నరకం లాంటి బాధ నుంచి విముక్తి కలిగించిన టిల్లి అనే వ్యక్తి సాహసానికి, మంచి మనసుకి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇండోనేషియా ఐల్యాండ్ సులావేసిలో పాలూ దగ్గర 2016లో ఒక మొసలి కనిపించింది. ఈ ఉప్పు నీటి మొసలి అప్పుడప్పుడు పశువులు, మనుషుల మీద దాడి చేస్తుండేది. అయితే ఎలా వచ్చి పడిందో తెలియదుగానీ.. దాని మెడకు ఓ టైర్ బిగుసుకుపోయింది. తీద్దామని అనుకున్నా.. దాడి చేస్తుందనే భయంతో దాని దగ్గరగా వెళ్లేందుకు అంతా భయపడ్డారు. బహుశా దానిని చంపేందుకో లేదంటే పెంచుకునేందుకో ఆ టైర్‌ను మెడకు ఉచ్చులా వేసి ఉంటారని భావించారు. ఈలోపు రెండేళ్లు గడిచాయి.
2018లో ఈ మొసలి వీడియో ప్రపంచం దృష్టితో పాటు జంతు సంరక్షకుల దృష్టిని ఆకర్షించింది. టైరు క్రమక్రమంగా దాని మెడకు బిగుసుకుపోతుండడంతో.. దానిని సంరక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2020లో ఆస్ట్రేలియా నుంచి మ్యాట్ రైట్ అనే పాపులర్ సంరక్షకుడు సైతం దానిని రక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో దానికి టైర్ తొలగించినవాళ్లకు మనీ ప్రైజ్ ఆఫర్ చేశారు అధికారులు. అయితే టిల్లి మాత్రం రివార్డు కోసం ముందుకు రాలేదు.
మూగజీవాలు ఆపదలో ఉన్నాయంటే.. అక్కడ వాలిపోతుంటాడు ఈ 33 ఏళ్ల వ్యక్తి. గతంలో పాముల నుంచి ఎన్నింటినో చాలా ఓపికగా రక్షించాడు కూడా. అందుకే మూడు రోజులు ఎదురుచూసి.. ఓ కోడిని ఎరగా వేసి మొత్తానికి ఆ మొసలిని పట్టేసుకున్నాడు. స్దానికుల సాయంతో దాని మెడకు పట్టిన టైరును తొలగించి.. పదమూడు అడుగులకు పైన ఉన్న ఆ రాకాసి మొసలిని తిరిగి నీళ్లలోకి వదిలేశాడు. ఇంతకీ మువాయ కలంగ్ బన్ అంటే.. మెడలో టైరు హారంగా ఉన్న మొసలి అని మీనింగ్ (crocodile with a tyre necklace). ఇచ్చిన ప్రకటన ప్రకారం రివార్డు ఇద్దామని అధికారులు అనుకుంటున్నప్పటికీ.. టిల్లి మాత్రం ఆ డబ్బును శాంక్చురీ కోసం విరాళంగా ప్రకటించేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment