వాషింగ్టన్ : అమెరికా షికాగో నగరంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున వందల మంది యువకులు వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టించారు. వాణిజ్య సముదాయాల్లోకి చొరబడి లూటీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పరిస్థితిని అదుపు చేసేందుకు జరిగిన కాల్పుల్లో ఒక పౌరుడు, సెక్యూరిటీ గార్డుతోపాటు సుమారు 13 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేశాయి. (వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం)
మాగ్నిఫిసెంట్ మైల్ తోపాటు, ఇతర ప్రాంతాల్లో సాయుధులైన వందలమంది దుండగులు షాపులు, హోటళ్లలోకి చొరబడి, షాపుల కిటీకీలను ధ్వంసం చేశారు. గంటల తరబడి విధ్వంసానికి తెగబడి భయోత్పాతం సృష్టించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ఆంక్షలను విధించారు. ఇది నేరపూరిత సంఘటన అని పోలీస్ సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ తెలిపారు. పోలీసులు ఒక నిరాయుధ యువకుడిని కాల్చి చంపారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అల్లర్లు చెలరేగాయన్నారు. అతను పోలీసులపై కాల్పులు జరపడంతో తాము తిరిగి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు చెప్పారు. తాజా ఘటనలో100 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై షికాగో మేయర్ లోరీ లైట్‌ఫుట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హింసను తీవ్రంగా ఖండించారు. నిందితులను తక్షణమే గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.
మరోవైపు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ కొంతమంది ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment