27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి..
సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్ టేకర్) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే.
పైన ఫొటోలో ఉంది కూపర్. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట.. ఐర్లాండ్ ఉత్తర భాగంలోని టైరోన్ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్‌డెర్రీలోని టోబర్‌మోర్‌లో ఉన్న తన కేర్ టేకర్ చెంతకు చేరింది.
కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్‌పాస్ ఎన్‌ఐ అనే ఛారిటీ కూపర్‌కు చెందిన అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది.
దాదాపు నెలపాటు సాగిన కూపర్ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment