సాక్షి, న్యూఢిల్లీ : మురికి కాల్వల్లో మనం పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర జల మార్గాల్లో కలసి, వాటి నుంచి నదులకు, నదుల నుంచి సముద్రాలకు చేరి వాటిలొని సకల జల చరాలకు ప్రాణాంతకం అవుతున్నాయనే విషయం తెల్సిందే. అయితే ఇలా పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు జల మార్గాల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయో తెలిస్తే అంతులేని ఆశ్చర్యం కలగక మానదు. మానవాళికి పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ' నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ' తరఫున బ్రిటన్‌లోని ఎక్సిటర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు భారత్‌లోని గంగా నదిలో, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో 500 ఎంఎల్ కలిగిన కొన్నిబాటిళ్లను వదిలి పెట్టారు. వారి గమనాన్ని ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు వీలుగా వాటిలో శాటిలైట్, జీపీఎస్ ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఆశ్చర్యంగా గంగా నదిలో వదిలేసిన ఓ ప్లాస్టిక్ బాటిల్ మిగితా రెండు వేర్వేరు సముద్రాల్లో వదిలేసిన బాటిళ్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది.
94 రోజుల్లో ఆ బాటిల్ 1768 మైళ్లు, అంటే 2, 845 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ప్రయోగానికి స్ఫూర్తినిచ్చిందీ ' మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అనే హాలీవుడ్ సినిమా. 1999లో లూయీ మండోకి దర్శకత్వంలో వెలువడిన ఆ ప్రేమ కథా చిత్రం నాటి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందుకేనేమో అదే చిత్రం స్సూర్తితో ఈ ప్రయోగానికికూడా 'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అని పేరు పెట్టారు.
ఇలాగే ప్రపంచ మానవాళి నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏటా సముద్రాలకు 80 లక్షల టన్నులు చేరుకుంటోందని 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేషన్' లెక్కలు తెలియజేస్తున్నాయి. సముద్రాలకు చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల్లో 80 శాతం నదుల ద్వారా వస్తున్నవేనని కనుగొన్నారు. డాక్టర్ ఎమిలీ డంకన్ పరిశోధనకు నేతృత్వం వహించారు. పలు కారణాల వల్ల కొన్ని ప్లాస్టిక్ బాటిళ్లు మార్గమధ్యంలో ఆగిపోవచ్చనే ఉద్దేశంతో మొత్తం ప్రయోగానికి 25 బాటిళ్లను ఉపయోగించారు. వాటిలో 22 బాటిళ్లు సరాసరి దూరం 165 మైళ్లు, అంటే దాదాపు 267 కిలోమీటర్లు చేరుకున్నాయని పరిశోధకులు వివరించారు. ఆ తర్వాత వాటిలో 14 బాటిళ్ల ఆచూకీ చిక్క లేదని, వాటిలో కొన్ని ప్రజల చేతికి చిక్కగా మిగతావి శాటిలైట్ యాంటెన్నా పాడై పోవడం వల్ల వాటి గమ్యాన్ని గుర్తించలేక పోయామని పరిశోధకులు తెలిపారు. గంగా నదిలోనే ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువగా చిక్కుకుపోయే అవకాశం ఉండడంతో ఆ నదిలోనే ఎక్కువ బాటిళ్లను వదిలేసినట్లు వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment