మానవ జ్ఞానం అవధుల్లేకుండా పెరుగుతున్న కొద్దీ అంతరిక్షానికి ఆవల ఏముందో చూడాలన్న ఆతృత పెరిగిపోతోంది. అంతరిక్ష యానం, ఇతర గ్రహాలపై నివాసం మనిషి మేథస్సుకు విసిరిన సవాళ్లు కాగా, క్రమంగా వీటిని జయిస్తూ వస్తున్నాడు మానవుడు. ఈ క్రమంలో చంద్రుడితో మొదలెట్టిన గ్రహాంతర యానాలు ఇతర గ్రహాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి చంద్రుడిపైకి మాత్రమే మనిషి వెళ్లగలిగాడు. కానీ త్వరలో ఇతర గ్రహాలపై పాదం మోపే ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే కొన్ని తరాల అనంతరం మనిషి ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవడం ఖాయమన్నది సైంటిస్టుల అభిప్రాయం.
గ్రహాంతర నివాసం కల సాకారం చేసుకునే క్రమంలో పలు దేశాలు పలు ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ తరహాలోనే అమెరికాకు చెందిన నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుండాలో లేదో అధ్యయనం చేసేందుకు భూమిపైనే కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో సంవత్సరం పాటు ఉండి ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం చూపే ఔత్సాహికుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో నాసా ఎంపిక చేసుకున్నవారు ఈ కృత్రిమ అంగారక వాతావరణంలో ఉంటూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటికి ఎలా సిద్ధమవ్వాలో అధ్యయనం చేస్తారు.
డ్యూన్ ఆల్ఫా
మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే 1700 చదరపు అడుగుల ఈ కృత్రిమ నివాస స్థలాన్ని అంగారకుడి వాతావరణాన్ని అనుసరించి 3డీ ప్రింటింగ్ ద్వారా సృష్టిస్తున్నారు. హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఈ కృత్రిమ కుజ నివాసం సిద్ధం చేస్తున్నారు. కుజుడిపై ఉండేలాగానే పరిమిత వనరులు, పరికరాలు ఫెయిల్‌కావడం, కమ్యూనికేషన్ తెగిపోవడం, ఇతర సహజసిద్ధ ప్రమాదాలు ఆల్ఫాలో ఉంటాయి. వీటన్నింటిని తట్టుకుంటూ అందులో ఉన్నవారు స్పేస్ వాక్ చేయడం, పరిశోధనలు చేయడం, వీఆర్ మరియు రోబోటిక్ కంట్రోల్స్ చేయడం వంటివి చేయాల్సిఉంటుంది. ఈ ప్రయోగంతో లభించే వివరాలు నిజమైన అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది.
అయితే ఇందులో ఒక చిన్న తిరకాసు ఉందండోయ్! కేవలం అమెరికా పౌరులకు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. అది కూడా 30–55 సంవత్సరాల్లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ధూమపానం అలవాటు లేకపోవడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఇంగ్లీష్ బాగా తెలిసిఉండడం వంటి అదనపు నిబంధనలు కూడా ఉన్నాయి. స్టెమ్ ఫీల్డ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిఉండాలి. నాలుగేళ్లపాటు అనుభవం ఉంటే మంచిది. మనకు అవకాశం లేదని బాధపడాల్సిన పనిలేదు. త్వరలో మన ఇస్రో కూడా ఇటువైపుగా అడుగులు వేయవచ్చు. గతంలో రష్యా కూడా ఇలాంటి మార్స్ మిషన్ ఒకటి చేపట్టింది, కానీ సక్సెస్‌కాలేదు. మరి నాసా యత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాల్సిందే!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment