New Coronavirus Cases Increases In Britain | Latest Updates On Britain Coronavirus Cases - Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ గుండెల్లో కోవిడ్ దడ

Published Fri, Jan 1 2021 8:36 AM | Last Updated on Fri, Jan 1 2021 1:17 PM

New Coronavirus Strain Tension In Britain - Sakshi

లండన్‌: కొత్త సంవత్సరం వేళ యూకేలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. బ్రిటన్‌ ప్రజలు ఆంక్షల చట్రం మధ్య బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. గత నెలరోజుల్లోనే రికార్డు స్థాయిలో నమోదైన కేసులు, మరణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతరూపం దాలుస్తోందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనల్ని పాటించాలని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించారు. కేసుల తీవ్రత ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించి వివిధ రకాలుగా ఆంక్షల్ని ప్రవేశపెట్టారు. కేసులు ఓ మాదిరిగా ఉంటే టైర్‌–1 అని, ఎక్కువ ఉంటే టైర్‌–2, అత్యధికంగా ఉంటే టైర్‌–3 అని పిలుస్తారు. ఇక టైర్‌–4లో ఉన్న ప్రాంతాల్లోని వారు అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రాకూడదు. నిత్యావసరాలు మినహా మిగతా మార్కెట్‌ అంతా మూసేశారు.

ఈమధ్య కాలంలో టైర్‌–4 ప్రాంతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి మార్కెట్లన్నీ మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. టైర్‌–4లో ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు ఏప్రిల్‌ వరకు కొనసాగుతాయి. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే దేశమంతటా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయి. (కొత్త వైరస్‌: యూకే నుంచి తెలంగాణకు..!)

యూకేలో ఎలా ఉందంటే..!! 
యూకే వ్యాప్తంగా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే 11శాతం ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. రికార్డు స్థాయిలో బుధవారం 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా,  గురువారం  మరిన్ని పెరిగి కొత్తగా 55,892 కేసులు వచ్చాయి. బుధ, గురువారాల్లో దాదాపు 2వేల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది.
మొత్తం కేసులు 24,88,780కు, మొత్తం మరణాలు 73,512కు చేరుకున్నాయి.
వేల్స్‌లో కేసులు శరవేగంగా పెరుగు తున్నాయి. ప్రతీ 60 మందిలో ఒకరికి వైరస్‌ సో కింది. వేల్స్‌ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు.  
ఇంగ్లండ్‌లో 2 కోట్ల మంది వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. సెకండరీ స్కూల్స్‌కి క్రిస్మస్‌ సెలవుల్ని మరో 15 రోజులు పొడిగించారు.
ఉత్తర ఐర్లాండ్‌లో 6 వారాల లాక్‌డౌన్‌.
స్కాట్‌లాండ్‌లో టైర్‌–4లో ఉండడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. స్కాట్‌ల్యాండ్‌ నుంచి యూకేలో ఇతర ప్రాంతాలైన ఇంగ్లండ్, వేల్స్,ఐర్లాండ్‌లకు రాకపోకలపై నిషేధం విధించారు.  
కొత్త రకం వైరస్‌ భయతో యూకే నుంచి విమాన రాకపోకలపై 40 దేశాలు నిషేధం విధించాయి.

ఆస్ట్రాజెనెకా ఆదుకుంటుందా ? 
కరోనా కట్టడికి గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తయారీలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్‌కి సన్నాహాలు చేస్తోంది. ఆ రోజుకి 5 లక్షల 30 వేల డోసులు సిద్ధంగా ఉంటాయని ఆరోగ్య శాఖ మంత్రి మట్‌ హన్‌కాక్‌ చెప్పారు. ఆస్ట్రాజెనెకా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల వ్యాక్సిన్‌లు తయారు చేసి అందిస్తామన్న హామీ ఇచ్చింది. అయితే టీకా డోసులు తయారైనప్పటికీ వాటి నాణ్యతని పరీక్షించి విడుదల చేయడానికి సమయం పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ వచ్చినంత మాత్రాన సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకోవద్దని, ప్రతీ వ్యక్తి కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. (చదవండి: పాములతో బాడీ మసాజ్..‌ గుండె ధైర్యం ఉంటేనే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement