
భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనడం కామన్. కానీ, ఇక్కడ మాత్రం అన్నా, తమ్ముడు, స్నేహితుడు ఆఖరుకు నాన్న మాట్లాడినా కూడా వారితో పాటు సమానంగా అదే మాటను ఏ మహిళా అక్కడ పలకదు. ఆశ్చర్యపోకండి. అవును.. అక్కడి ప్రజల్లో ఏ జెండర్‌కు ఆ భాష నడుస్తోంది. అంటే అక్కడి మహిళలకు, పురుషులకు వేర్వేరు భాషలు ఉన్నాయి.
ఉదాహరణకు దుస్తులను పురుషుడు ‘నికి’ అంటే, స్త్రీ ‘అరిగా’ అని.. చెట్టును ‘కిచి’ అంటే ‘ఓక్వెంగ్’ అనే భిన్న పదాలతో సంభాషిస్తారు. కేవలం వారి భాషలే కాదు, లిపులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. తరతరాలుగా వారు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. మరి, ఆ ప్రాంత ప్రజలు జీవనం ఎలా సాగిస్తున్నారు?, అక్కడ ఓ స్త్రీ మరో స్త్రీతో తప్ప.. ఒక పురుషుడు మరో పురుషుడితో తప్ప స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? అని అనుకుంటే పొరపాటే.. ఇద్దరికీ రెండు భాషలు తెలుసు.
కానీ, సంప్రదాయాన్ని గౌరవించి కేవలం వారు మాట్లాడే భాషల్లోనే మాట్లాడతారు. కేవలం వారి పిల్లలకు తప్ప మరో తెగతో కానీ, సమాజంతో గానీ వారి భాషలను నేర్పించడానికి ఇష్టపడరు. కారణం అక్కడి స్త్రీలు శుక్రగ్రహం నుంచి పురుషులు అంగారక గ్రహం నుంచి వచ్చారని, ఇది దైవ రహస్యం అని వారి నమ్మకం. విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ వారు ఎవరో చెప్పలేదు కదా. నైజీరియా అడవుల్లో నివసించే ఓ ఆటవిక తెగ ప్రజలు.
Comments
Please login to add a commentAdd a comment