ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్
సియోల్: కరోనా వైరస్ భయంతో ఉత్తర కొరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొలి కరోనా కేసు నమోదైనట్టుగా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ కొరియా నుంచి ఇటీవల కైసాంగ్ నగరానికి వచ్చిన ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది. మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకి పారిపోయి వెళ్లిన ఆ వ్యక్తి జూలై 19న అధికారుల కన్నుగప్పి సరిహద్దు నగరమైన కైసాంగ్‌లోకి ప్రవేశించినట్టు కేసీఎన్‌ఏ తెలిపింది. రక్త పరీక్షల్లో ఆ వ్యక్తికి వైరస్ సోకినట్టు తేలడంతో దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కైసాంగ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ రోగిని క్వారంటైన్‌లో ఉంచడమే కాదు, అతడిని కలుసుకున్న వారిని, అయిదు రోజులుగా కైసాంగ్ నగరానికి వెళ్లి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో ఉంచింది.
తొలిసారిగా అత్యవసర పరిస్థితి
ఇప్పటివరకు దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఇన్నాళ్లూ ఉ. కొరియా చెబుతూ వస్తోంది. అయితే చైనాతో విస్తృతమైన సరిహద్దుల్ని పంచుకున్న ఆ దేశంలో కరోనా లేదంటే నమ్మశక్యం కావడం లేదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ బట్టబయలైన తొలిరోజుల్లో ఉత్తర కొరియా కరోనా లక్షణాలున్న కొందరిని క్వారంటైన్‌లో ఉంచినట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఇలా ఒక నగరాన్ని పూర్తిగా మూసేయడం ఇదే తొలిసారి. ఆరోగ్య రంగంలో అంతంత మాత్రంగానే ఉండడంతో రెండు లక్షల జనాభా ఉన్న కైసాంగ్‌లో తొలి అనుమానాస్పద కేసు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment