భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..! | Oklahoma Woman Gives Birth To Baby After 14 Months Of Husband Succumbed | Sakshi
Sakshi News home page

భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి మగబిడ్డకు జన్మ..!

Published Thu, Jul 22 2021 7:23 PM | Last Updated on Fri, Jul 23 2021 9:58 AM

Oklahoma Woman Gives Birth To Baby After 14 Months Of Husband Succumbed - Sakshi

సృష్టిలో దేవ‌త‌ల‌కు కూడా ద‌క్క‌ని అపూర్వ బ‌హుమ‌తి మ‌నుషుల‌కు ద‌క్కింది. అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు.. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు అంటారు. ప్రతి మహిళ తన జీవితంలో అమ్మ అనిపించుకోవాలి అనుకుంటుంది. 

వాషింగ్టన్‌:
ఓక్లహామాకు చెందిన సారా షెలెన్‌బెర్గర్(40) అనే మహిళ తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే..  అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్‌ సహకారంతో ఆమె ఈ ప్రక్రియను కంప్లీట్ చేసింది. ‘‘చిన్నారి రాకతో నా మాతృహృదయం ఉప్పొంగింది. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోంది.’’ అని తెలిపింది.

కాగా, దక్షిణ నజరేన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సారా, స్కాట్ కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. సెప్టెంబర్ 2018 లో వివాహం చేసుకున్నారు. కనీసం ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని కోరుకున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు.  ఆమె భర్త స్కాట్‌(41) గతేడాది ఫిబ్రవరిలో గుండు పోటుతో కన్నుమూశారు.

మరి ఎలా సాధ్యమైంది?
పిల్లల కోసం ఈ జంట చాలాకాలం నిరీక్షించింది. అయితే వైద్యులు ఐవీఎఫ్‌ను ఎంచుకోవాలని వారికి సలహా ఇచ్చారు. యుఎస్‌లో ఐవిఎఫ్ పద్దతిలో బిడ్డను కనడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ఈ జంట బార్బడోస్ ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లారు. కానీ, బిడ్డ పుట్టకముందే ఆమె భర్త కన్నుమూశారు. అయితే పిండం ప్రక్రియను ప్రారంభించడానికి ముందు సారా, ఆమె భర్త అందుకు చేయాల్సిన పనులను పూర్తి చేశారు. జీవిత భాగస్వామి చనిపోతే పిండాలకు సంబంధించి తదుపరి ప్రక్రియ ఎలా అనుసరించాలో అందులో రాసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమెకు బిడ్డను కనేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ బిడ్డకు జన్మనిచ్చింది. 

రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి
‘‘తన భర్త ఇప్పుడు లేడు. కానీ ఈ  సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలను. బిడ్డ పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఓ అర్థం దొరికినట్లు ఉంది. పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతాను. అంతేకాకుండా మరో పిండం కూడా భద్రపరచి ఉంది. అదే చివరిది… దానితో వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’’ అని సారా షెలెన్‌బెర్గర్  చెప్పారు. ఇక సారా తన భర్త, బిడ్డతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. అవి ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement