పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్‌సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడినట్లుగా ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఈ పరిణామం చోటు చేసుకోవడంతో.. పాక్‌లో రాజకీయ దుమారం చెలరేగింది.
పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ యూట్యూబ్‌లో ఆ ఆడియో క్లిపులను షేర్ చేశారు. దీంతో పాక్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అందులో ఉంది ఇమ్రాన్ ఖాన్ వాయిస్ అనేది ఆరోపణ. విశేషం ఏంటంటే.. ఈ ఆడియో క్లిప్స్ తాజావేనని అందులోని సంభాషణల ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రధాని కార్యాలయం నుంచే వెలువడ్డాయని ఖాన్ అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి.
మరోవైపు.. పీటీఐ మాత్రం ఈ కాల్ సంభాషణలను కొట్టిపారేస్తోంది. అదంతా ప్రభుత్వం కుట్రేనని, తమ అధినేతను బద్నాం చేసే కుట్రలో భాగంగా ఫేక్ క్లిప్స్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. వాళ్లు ఇంతకంటే ఏం చేయలేరని పీటీఐ అధికార ప్రతినిధి అర్సలన్ ఖలీద్ పేర్కొన్నారు.
ఇక ఆ ఆడియో క్లిప్‌లో సదరు మగ గొంతు తనను కలవాలంటూ అవతలి మహిళను బలవంతం పెట్టగా.. ఆమె కుదరదని చెప్పడం వినొచ్చు. అంతేకాదు.. తన భార్యాబిడ్డలు రాకుండా ప్రయత్నిస్తానని కూడా ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ కాస్త ఇమ్రాన్ హష్మీ(బాలీవుడ్ నటుడు)గా మారిపోయాడంటూ సౌత్ ఏషియా కరస్పాండెంట్, జర్నలిస్ట్ నలియా ఇనాయత్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment