ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న వేళ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వచ్చే అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ శనివారం ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
2018 నుంచి 2022 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వచ్చిన కానుకల్ని అక్రమ మార్గాల్లో కారు చౌకగా తానే కొనుగోలు చేశారని తోషఖానా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మూడేళ్ల జైలు శిక్షతో పాటుగా న్యాయమూర్తి లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఇమ్రాన్‌ఖాన్ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి వచ్చిన కానుకల్ని తీసుకున్నారు.
ఆ కానుకల ద్వారా తాను పొందిన ఆర్థిక లబ్ధిని దాచి ఉంచడానికి ప్రయత్నించారు. తోషఖానా కానుకలకు సంబంధించిన సమాచారం అందించడంలో ఇమ్రాన్‌ఖాన్ మోసం చేశారనడానికి తగిన ఆధారాలున్నాయి. ఇమ్రాన్‌ఖా న్ నిస్సందేహంగా అవినీతిపరుడని రుజువైంది’’ అని న్యాయమూర్తి హుమయూన్ ఆ తీర్పులో పేర్కొన్నారు. ఎప్పుడైతే మూడేళ్ల జైలు శిక్ష పడిందో రాజ్యాంగంలోకి ఆర్టికల్ 63(1)(హెచ్) ప్రకారం అయిదేళ్లపాటు ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడింది.
ఇమ్రాన్‌ఖాన్ పదవిలో ఉన్న మూడున్నరేళ్ల కాలంలో ప్రపంచ దేశాల అధినేతల నుంచి రూ.14 కోట్ల విలువైన 58 కానుకలు పొందారు. ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మూడు నెలల్లోగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఇమ్రాన్‌కు శిక్ష పడడం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన కొద్ది సేపటికే లాహోర్‌లోని జమన్ పార్క్‌లో ఇమ్రాన్‌ఖాన్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. లాహోర్ నుంచి ఇమ్రాన్‌ను హెలికాఫ్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించారు.
శాంతియుతంగా నిరసనలు చేయండి: ఇమ్రాన్‌ఖాన్
అరెస్ట్‌ను ముందే ఊహించిన ఇమ్రాన్.. కార్యకర్తలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని రికార్డు చేసి ఉంచారు. ఇమ్రాన్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ‘సందేశం మీరు వినే సమయానికి నేను జైల్లో ఉంటాను. పార్టీ సభ్యులందరూ ఇళ్లలో కూర్చోకుండా బయటకు వచ్చి శాంతియుతంగా నిరసనలు చేయండి. నేను చేస్తున్న పోరాటం నా కోసం కాదు. మీ కోసం. మీ పిల్లల భవిష్యత్ కోసం. మీరు మీ హక్కుల కోసం పోరాడకపోతే బానిసలుగా బతకాల్సి వస్తుంది. బానిసలకు ఎప్పుడూ బతుకు ఉండదు.
బానిసలంటే నేల మీద పాకే చీమలతో సమానం. వారు పైకి ఎగరలేరు. ఎదగలేరు. మీ హక్కుల్ని మీరు కాపాడుకునే వరకు శాంతియుత నిరసనలు చేయండి. భవిష్యత్‌లో మీరు ఎన్నుకునే ప్రభుత్వం ఉండాలి కానీ కబ్జా మాఫియా కాదు’’ అని ఇమ్రాన్ తన సందేశంలో పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఒక్క రోజు ముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్న భయం ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. గణనీయంగా ఓటు బ్యాంకు పెరుగుతున్న తమ పార్టీని ఎలా నిర్వీర్యం చేస్తారని ఇమ్రాన్ ప్రశ్నించారు.
భుట్టో నుంచి ఇమ్రాన్ వరకు
పాకిస్తాన్ ప్రధానులు, మాజీ ప్రధానులు జైలు పాలవడం సర్వసాధారణంగా మారింది. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే ఎందరో తమ చరమాంకంలో జైలు జీవితాన్నే గడిపారు. మిలటరీయే శక్తిమంతంగా ఉండే దేశంలో జనరల్ అయూబ్‌ఖాన్, యాహ్యాఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషార్రఫ్ వంటి వారు నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాల్ని కూలదోసి పగ్గాలు చేపట్టారు.
► పాకిస్తాన్ అయిదో ప్రధానిగా సేవలందించిన షాహీద్ సుహ్రావార్డీ జాతి వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 1962లో జైలు పాలయ్యారు. అప్పటి మిలటరీ పాలకుడు జనరల్ అయూబ్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతోనే ఆయనపై కేసులు పెట్టారు.
► దేశ తొమ్మిదో ప్రధాని జుల్ఫీకర్ ఆలీ భుట్టో తన రాజకీయ ప్రత్యర్థి హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై 1974లో అరెస్ట్ చేశారు. 1979, ఏప్రిల్ 4న ఆయనని ఉరి తీశారు.
► దేశానికి ఏకైక మహిళా ప్రధాని అయిన బెనజీర్ భుట్టో పలుమార్లు అరెస్టయ్యారు. 1985లో తొలిసారిగా ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. తిరిగి 1999లో అవినీతి కేసులో ఆమెకు అయిదేళ్లు జైలు శిక్ష పడింది. శిక్షను తప్పించుకోవడానికి ఆమె ప్రవాసం వెళ్లిపోయారు. తిరిగి దేశానికి వచ్చాక 2007లో రావల్పిండిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాక బెనజీర్ దారుణ హత్యకు గురయ్యారు.
► 1999లో జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పదవీ పగ్గాలను తీసుకున్నాక అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన పదేళ్ల పాటు ప్రవాసంలో ఉన్నారు. 2018 జూలైలో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2019లో చికిత్స కోసం లండన్ వెళ్లిన ఆయన ఇప్పటికీ తిరిగి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment