ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో అరెస్టైన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు.
అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు కనీసం వారెంటు చూపించలేదని, అంతేకాకుండా తన భార్య గది తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఇమ్రాన్ ఆరోపించినట్లు చెప్పారు. ‘ నన్ను ఓపన్ వాష్‌రూం ఉన్న ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, వార్తాపత్రిక కూడా లేదు. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. జీవితమంతా జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ చెప్పారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు.
కాగా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ గడువు ఆగస్టు 12న పూర్తికానుండగా, ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో ఇమ్రాన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే కనిపిస్తోంది.
చదవండి: స్మార్ట్‌ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment