రోమ్: ఆనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడో వచ్చిందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ‘‘అందుకే పోప్‌గా ఎన్నికైన వెంటనే త్యాగపత్రం (రాజీనామా లేఖ) రాశా. దాన్ని కార్డినల్ టార్సిసియో బెర్టోనే చేతికిచ్చా. నేను విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే పనికొస్తుందని చెప్పా’’ అని చెప్పారు. ఆయన తాజాగా ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తదితరాల వల్ల పోప్ విధులు నిర్వర్తించలేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ఈ మేరకు వెల్లడించారు.
అలాంటప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పే నిబంధన ఉందని బదులిచ్చారు. రహస్యం బయట పెట్టాను గనుక ఎవరైనా బెర్టోనే దగ్గరికెళ్లి పోప్ రాజీనామా లేఖ చూపించమని అడగవచ్చంటూ చమత్కరించారు. శనివారం 86వ ఏట అడుగు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం తెలిసిందే. ఆయనకు 2021లో పేగు శస్త్రచికిత్స జరిగింది. మోకాలి నొప్పి తీవ్రంగా బాధించడంతో కొద్ది నెలలు వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఇప్పుడు చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. మోకాలి నొప్పి బాధ్యతల నిర్వహణకు అడ్డంకిగా మారిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మనం తలతో పని చేస్తాం తప్ప మోకాలితో కాదంటూ ఛలోక్తి విసిరారు.
వృద్ధాప్య కారణాలతో గతంలో పోప్ బెనెడిక్ట్ రాజీనామా
ఫ్రాన్సిస్‌కు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్–16 రాజీనామా చేయడం తెలిసిందే. వృద్ధాప్యం వల్ల బాధ్యతలను సరిగా నిర్వర్తించ లేకపోతున్నానంటూ ఆయన 2013లో రాజీనామా చేసి తప్పుకున్నారు. గత 600 ఏళ్లలో ఇలా బాధ్యతల నుంచి తప్పుకున్న తొలి పోప్‌గా రికార్డు సృష్టించారు. అనంతరం ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment