
ప్రపంచదేశాలు సంఘీభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు.
ఐక్యరాజ్యసమితి: ‘‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే ఇది సాకారమవుతుంది’’ అని నటి, దర్శకురాలు ప్రియాంకా చోప్రా జోనాస్ అన్నారు. ప్రపంచదేశాలు సంఘీభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్‌డీజీ)ల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ అయిన చోప్రా ఎస్‌డీజీపై మంగళవారం జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు.
ప్రమాదం ముంగిట ప్రపంచం
ప్రపంచ దేశాల మధ్య విభేదాలు భద్రతా మండలి వంటి కీలక అంతర్జాతీయ వ్యవస్థలను బలహీనపరుస్తున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచం ప్రమాదం అంచున ఉందన్నారు. అంతర్జాతీయ సహకారం లేకుండా మనుగడ సాగించలేమని గుర్తు చేశారు. ప్రపంచం ముంగిట ఉన్న సవాళ్లను సహకారం, చర్చల ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని తెలిపారు.