రష్యా వేసిన పేలని 500 కేజీల బాంబును ఖర్కీవ్‌లో తొలగిస్తున్న దృశ్యం
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌లోకి రష్యా సైన్యం మరింతగా చొచ్చుకుపోతోంది. గురువారం ఆ ప్రాంతంలో పలు గ్రామాలతో పాటు భారీ పరిమాణంలో భూభాగాన్ని ఆక్రమించి కీలకమైన హైవేను చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. అదే జరిగితే ముందుండి పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు సరఫరా మార్గాలన్నీ మూసుకుపోతాయి. రష్యా సైన్యానికి నానాటికీ అదనపు బలగాలు వచ్చి పడుతుండటంతో లిసిచాన్స్‌క్ నగరాన్ని అన్నివైపుల నుంచీ ముట్టడించేందుకు సిద్ధమవుతోంది.
అందులో చిక్కే ప్రమాదాన్ని తప్పించుకునేందుకు నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెనుదిరుగుతున్నాయి. లెహాన్స్‌క్ ప్రాంత పాలనా కేంద్రమైన సెవెరోడొనెట్స్‌క్ నగర సమీపంలోని పలు ఇతర పట్టణాలు, గ్రామాలపై రష్యా సైన్యం ఇప్పటికే అదుపు సాధించిందని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. సెవరోడొనెట్స్‌క్‌ను కూడా పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఉక్రెయిన్ ప్రతిఘటన అజోట్ కెమికల్ ప్లాంటుకే పరిమితమైంది.
కొద్దిపాటి సైనికులు పౌరులతో పాటు వారాలుగా ప్లాంటులో చిక్కుబడి ఉన్నారు. డోన్బాస్‌లో సగం మేరకు విస్తరించిన లుహాన్స్‌క్ ప్రాంతం ఇప్పటికే 95 శాతానికి పైగా రష్యా అధీనంలోకి వెళ్లిపోయింది. మరోవైపు ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ సభ్యత్వం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బ్రెసెల్స్‌లో జరగనున్న ఈయూ శిఖరాగ్రంలో ఉక్రెయిన్‌కు అభ్యర్థి హోదా ఇస్తారని తెలుస్తోంది. తద్వారా ఉక్రెయిన్‌ను ఈయూలో చేర్చుకోవడంపై సభ్య దేశాలు అధికారికంగా చర్చలు జరుపుకోవడం వీలు పడుతుంది.
ఈయూ పూర్తి సభ్యత్వ ప్రక్రియలో అభ్యర్థి హోదా తొలి అడుగు. అంతకుముందు ఈయూ ప్రశ్నావళికి ఉక్రెయిన్ ఇచ్చిన సమాధానాలను ఈయూ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదించింది. ఇక అమెరికాలోని భారతీయులు గురువారం ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. రష్యా తక్షణం నరమేధాన్ని ఆపాలంటూ నినదించారు. ఉక్రెయిన్‌పై దాడిని అమెరికాలోని భారతీయులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్టు ప్రపంచంలో అతి పెద్ద క్రీడా ఉపకరణాల తయారీ సంస్థ నైక్ పేర్కొంది. దేశంలో అమ్మకాలను అదిప్పటికే నిలిపేసింది. వందలాది టాప్ కంపెనీలు ఇప్పటికే రష్యాకు గుడ్‌బై చెప్పడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment