కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది.
ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్‌ఎస్‌ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు.
ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment