ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. నేరం, అరెస్టు, జైలు.. ఇదే దశాబ్దాలుగా నేరస్తులకు ఎదురవుతున్న క్రమం. అయితే కాలం గడిచేకొద్దీ దీనిలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. తద్వారా వారు వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది.
అయితే ఒక నేరస్తుడు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే.. ఏం జరుగుతున్నదనేది ఊహించడం కష్టం. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు.
కమోల్జోన్ కలోనోవ్ డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం లాంటి క్రిమినల్ కేసులలో గత 22 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయన విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటుఅతనిపై మరొక కేసు నమోదు చేశారు.
రష్యాలోని ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ప్రాంతీయ విభాగం అధికారులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ ఖైదీ కమోల్జోన్ కలోనోవ్.. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరవాసి అని, పలు నేరాలలో ప్రమేయం ఉండటంతో జైలుకు తరలించారని తెలిపారు. 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే 2001లో అతను డబుల్ మర్డర్‌లో దోషిగా తేలడంతో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు.
తాజాగా అతను విడుదల కావాల్సిన రోజు రాగానే జైలు నుండి పరారయ్యాడు. ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఆఫ్ రష్యా ప్రకారం కమోల్జోన్ కలోనోవ్ కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్‌ను కూలీ పనులకు పంపనున్నారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ కలోనోవ్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment