సాక్షి, విశాఖపట్నం: ప్రేమించిన యువతి కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ బోర్డర్‌లో 2019 లో చిక్కుకున్న ప్రశాంత్ కథ మొత్తానికి క్షేమంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రశాంత్ తండ్రి బాబురావు మాత్లాడుతూ.. మా కుమారుడిని వెనక్కు రప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేశాయని అన్నాడు. అధికారులు, నిరంతరం పాక్‌తో సంప్రదింపులు జరిపారని తెలిపారు. దీని ఫలితంగానే మా అబ్బాయిని ఇంత తొందరగా చూడగలిగామని ప్రశాంత్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.
‘మా అబ్బాయి కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని బాబురావు చెప్పారు. మా చుట్టుపక్కల ఉన్న అపార్ట్ మెంట్ వాసులు మాకు ఎంతగానో ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో మా అబ్బాయి ఇక రాడని ఆశలు కూడా వదిలేసుకున్నామని అన్నారు. కానీ తమ ప్రయత్నాలను మాత్రం ఆపలేదని చెప్పారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు సహయత అనే స్వచ్ఛంద సంస్థ అందించిన సహకారం తమ జీవితంలో మరిచి పోలేమని అన్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రశాంత్ కూడా తన తల్లిదండ్రులను చేరిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. తన జీవితంలో అమ్మనాన్నలను కలుస్తానని అనుకోలేదని అన్నాడు. తనలాగే పాక్లోవివిధ కారణాలతో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపాడు. అయితే, అక్కడ ఇరుకున్న మన వారి జాబితాను భారత ప్రభుత్వానికి ఇచ్చానని ప్రశాంత్ తెలిపాడు. వీరిని కూడా వీలైనంతా త్వరగా మనదేశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే, పాక్‌లో తాను ప్రవేశించిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ‘తాను మొదట ఇండియా, పాక్ బార్డర్ చేరుకున్నానని పేర్కొన్నాడు. అక్కడ ఎవరు పట్టుకోలేదని, దాదాపు 40 కిలోమీటర్లు ఎడారిలో ప్రయాణించానని తెలిపాడు.
ఈ క్రమంలో ఒక హైవేపై వెళుతుండగా, హైవే పెట్రోల్ వాహనం తనను రెండో రోజు పట్టుకున్నారని అన్నాడు. తనను పాక్‌లోని భావల్ పూర్ జైలుకు తరలించారని చెప్పాడు. అయితే, పాక్ భద్రత సిబ్బంది తనపట్ల మానవత్వం చూపించారని అన్నాడు. పాక్‌లో ఏ భారత్ ఖైదీలతో పనిచేయించరని పేర్కొన్నాడు. తాను జైలులో ఉన్నప్పుడు శివుణ్ని ప్రార్థించేవాడినని తెలిపాడు. అయితే, భారత్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చోరవతో తిరిగి నా దేశాన్ని , నా తల్లిదండ్రులను చేరగలిగానని అన్నాడు. అయితే, జైలులో ఉన్నప్పుడు అనేక పుస్తకాలు చదివానని తెలిపాడు. తిరిగి సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగం సాధించి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని అన్నాడు. ‘ ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల మాటలు వినాలని, తనలాగా వేరేవరు కష్టపడొద్దని కోరుకుంటున్నానని తెలిపాడు.
చదవండి: పాక్ చెర వీడిన ప్రశాంత్
Comments
Please login to add a commentAdd a comment