
మాస్కో: ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ విడుదలను డిమాండ్ చేస్తూ వేల సంఖ్యలో అతని మద్దతుదారులు ఆదివారం మాస్కో వీధుల్లోకి చేరారు. భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కడంతో అప్రమత్తమైన రష్యన్ అధికారులు 1000 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలను చూడలేదని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా, అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అవినీతిపై అను నిత్యం విమర్శలు చేసే 44 ఏళ్ల అలెక్స్ నవాల్నీపై ఐదు నెలల క్రితం ఓ విమానంలో విషప్రయోగం జరగడంతో అతను కోమాలోకి వెళ్లాడు. రష్యాలో అతనికి సరైన చికిత్స అందదన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన అతని మద్దతుదారులు అతన్ని జర్మనీకి తరలించి చికిత్సనందించారు. అనంతరం కోలుకున్న ప్రతిపక్ష నాయకుడు ఐదు నెలల తరువాత జనవరి 17న మాస్కోకు తిరిగి వచ్చారు. అయితే గతంలో నమోదైన మనీ లాండరింగ్ కేసులో రష్యా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న అతని మద్దతుదారులు గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళలకు దిగారు.