సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించాడు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈలోపు.. రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఆయన్ని కోర్టుకీడ్చింది. అయితే.. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని.. పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటన్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారాయన.
దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ (Sam Altman) తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడంటూ ఆన్ ఆల్ట్‌మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఆమె ఈ తరహా ఆరోపలు చేయడం ఇదేం కొత్త కాదు. కాకుంటే ఈసారి దావా వేయడంతో శామ్ ఆల్టమన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామంపై ఆయన ఏమన్నారంటే..
‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్‌పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది.
.. ఆమె గోప్యత దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శామ్‌పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని.. సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆల్ట్‌మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఆరోపణలు చేసిన అన్నే ఆల్ట్‌మన్(Annie Altman).. ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గానూ శ్యామ్‌ను విచారించాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి గానూ 75వేల డాలర్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు.
‘‘మిస్సోరీలోని క్లేటన్‌లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్‌కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని శామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు.
ఓపెన్‌ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్టమన్ ప్రపంచానికి సుపరిచితుడే. ఏఐ బూమ్‌లో ఈయనొక ప్రముఖుడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు నలుగురు పిల్లలు కాగా, శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్.. కిందటి ఏడాది జనవరిలో తన బాయ్‌ఫ్రెండ్ అలీవర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మద్దతు క్యాంపెయిన్‌కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు.
ఇక.. గత ఏడాది ఓపెన్‌ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా.. ఓపెన్‌ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: అద్భుతాలు చేస్తాడనుకున్నాం కానీ,.. సుచీర్ బాలాజీ తల్లిదండ్రుల రోదన
Comments
Please login to add a commentAdd a comment