వాషింగ్టన్: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్ గ్రూపు చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసంలో 40 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్, ఈజిప్టులకు చెందిన దూతలు ఈజిప్టు రాజధాని కైరోలో హమాస్ గ్రూపు ప్రతినిధులతో జరుపుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాల్పుల విరమణ డీల్‌లో భాగంగా ఇటు హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు గాజాకు మానవతాసాయాన్ని భారీగా పెంచేందుకు అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్ కల్పించడం అనేవి ప్రధాన షరతులుగా ఉన్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పి తమ వద్ద ఉన్న బంధీలను విడుదల చేయాలంటే హమాస్ భారీ డిమాండ్లు ముందు పెడుతోంది.
ఇజ్రాయెల్ తమపై దాడులు పూర్తిగా ఆపాలి, ఇజ్రాయెల్ సేనలు గాజా నుంచి వెళ్లిపోవాలి, ఇళ్లు వదిలి పోయిన గాజా వాసులు తిరిగి ఇళ్లకు వచ్చే పరిస్థితులు కల్పించాలి లాంటి డిమాండ్లు పరిష్కరించి యుద్ధానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలని హమాస్ కోరుతోంది. అయితే వీటన్నింటికి ముందు కాల్పుల విరమణ అనేది తప్పనిసరని పేర్కొంటోంది.
దీనికి ఇజ్రాయెల్ స్పందిస్తూ తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ పాటించి గాజా వాసులకు మరింత మానవతాసాయం అందించేందుకు మాత్రమే ఒప్పుకుంటామని, హమాస్ అంతమయ్యేదాకా యుద్ధం ఆపేది లేదని తేల్చి చెబుతోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఇజ్రాయెల్, హమాస్‌లు తక్షణం కాల్పుల విరమించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కాల్పుల విరమణ తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment