కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశమయ్యే సమయం దగ్గర పడుతోంది. కాబూల్ శివార్ల దాకా తాలిబన్లు చొచ్చుకొని వచ్చి సరిగ్గా 11 కి.మీ. దూరంలో తిష్టవేసుకొని కూర్చున్నారు. దేశ రాజధాని కాబూల్‌ని ముట్టడించే పని ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అఫ్గాన్ మొత్తం తాలిబన్ల వశమైతే మరోసారి దేశం అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతుందనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది చెప్పారు.
అఫ్గాన్ నుంచి అమెరికా ఈ నెల 31న చివరి విడత బలగాలను ఉపసంహరించాల్సి ఉండగా, దానికి రెండు వారాల ముందే తాలిబన్లు కాబూల్‌లో తమ జెండాని ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం ఒక్కరోజే మరో ఐదు ప్రావిన్స్‌లను ఆక్రమించుకున్నారు. లోగర్ ప్రావిన్స్ స్వాధీనం చేసుకునే సమయంలో తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. అయినప్పటికీ తాలిబన్ల ధాటికి అఫ్గాన్ దళాలు నిలవలేకపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న పక్తికా ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నట్టు ఆ ప్రావిన్స్ ప్రజాప్రతినిధి ఖలీద్ అసాద్ వెల్లడించారు. ఆ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరమైన సహరానా తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుంది.
దేశంలోని దాదాపుగా ముప్పావు వంతు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కీలక నగరాలైన హెరాత్, కాందహార్‌లు (దేశంలోని రెండో, మూడో అతిపెద్ద నగరాలు) ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలను కొల్లగొట్టేసి తమ సంస్థకు చెందిన తెల్ల జెండాను ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురవేస్తున్నారు. ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతున్న తాలిబన్లు మజార్ ఏ షరీఫ్(బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని)ను ఆక్రమించుకోవడానికి ముప్పేట దాడి చేశారు. భీకరపోరు తర్వాత శనివారం రాత్రి మజార్ ఏ షరీఫ్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఫర్యాబ్, కునార్ ప్రావిన్స్‌లు కూడా తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చేశాయి.
ఉలిక్కిపడిన అమెరికా, కాబూల్‌కు 3 వేల బలగాలు
తాలిబన్లు చెలరేగిపోతూ వాయువేగంతో ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉండడంతో అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి 3 వేల మంది భద్రతా బలగాలను పంపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యం కావడంతో ఆగస్టు 31 నాటికి పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యాలను ప్రభుత్వం అందుకోగలదా లేదా అన్న సందేహాలైతే ఉన్నాయి. మూడువేల బలగాల్లో కొంతమంది శుక్రవారం కాబూల్‌కు చేరుకోగా... మిగతా వారు ఆదివారం నాటికి రానున్నారు. ఈ బలగాలు కాబూల్ చేరుకొని దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకువస్తాయి. తాలిబన్లు కాబూల్ చేరే లోపు అమెరికా చేసే ఈ ఆపరేషన్ ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం అమెరికాకి చెందిన సైనికులు వెయ్యి మంది మాత్రమే ఉండడంతో తమ సిబ్బందిని తరలించడం కష్టమవుతుందనే అంచనాతోఅప్పటికప్పుడు 3 వేల మంది సైనికుల్ని పంపింది.
క్షణక్షణం బతుకు భయం
అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగుస్తూ ఉండడంతో ప్రజల్లో రోజు రోజుకీ ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇక ముందు తమ బతుకులు ఎలా ఉంటాయోనని తలచుకుంటే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. మజర్–ఏ–షరీఫ్ చుట్టూ తాలిబన్లు మోహరించి ఉండడంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని నగరవాసి మొహిబుల్లా ఖాన్ చెప్పారు.
సుస్థిరతకే కృషి: అధ్యక్షుడు ఘనీ
అఫ్గాన్‌లో సుస్థిరత ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, దేశంలో చెలరేగే హింసాత్మక పరిస్థితుల్ని అడ్డుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సాయుధ బలగాలను తిరిగి సమాయత్తపరచడానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కాబూల్ శివార్లకి చేరుకున్న నేపథ్యంలో ఘనీ రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోతారని విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. అంతర్జాతీయ మీడియా ఇక ఘనీ పని అయిపోయినట్టుగా కథనాలు రాసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం నాడు టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గత 20 ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని అన్నారు.
అఫ్గాన్లపై యుద్ధాన్ని ప్రకటించి, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే తన రాజీనామా విషయంపై వస్తున్న వార్తల గురించి ఆయన ప్రస్తావించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి, యుద్ధ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించడానికి అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దేశంలో శాంతి, సుస్థిరత ఏర్పాటు చేయడానికి రాజకీయ పక్ష నాయకులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పారు. శాంతి, సుస్థిర స్థాపనకు పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ఘనీ స్పష్టం చేశారు.
► 22: అఫ్గాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లలో 22 ఇప్పటికే తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోయాయి
► 5: శనివారం తాలిబన్ల వశమైన ప్రావిన్స్‌లు
► 3000: కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరులను తరలించేందుకు అమెరికా అత్యవసరంగా 3వేల మంది సైనికులను పంపుతోంది
Comments
Please login to add a commentAdd a comment