
చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటేనో.. చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్న సమయాల్లో సాధారణంగా తల్లులు ఏదో ఒక బూచిని చూపి వారిని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా తల్లిదండ్రులు ఇలాంటి ధోరణే అవలంబిస్తారట. అయితే అక్కడి బూచోడికి ఓ పేరుంది. సీ ఓయే. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం మరణించిన అతడి శవాన్ని ఓ ఆస్పత్రి మ్యూజియంలో గాజు గ్లాసులో భద్రపరిచారు. అతడి గురించిన కథలు వింటే పెద్దవాళ్లకు సైతం వెన్నులో వణుకు రావాల్సిందే. అందుకే..‘‘సీ వస్తాడు. నీ లివర్ తినేస్తాడు’’అనగానే అల్లరి పిడుగులు కూడా కిమ్మనకుండా చెప్పిన మాట వింటారట.
అయితే ‘సీ’ నిజంగానే అంతటి నరరూప రాక్షసుడా లేదా అకారణంగా శత్రుత్వ రాజకీయాలకు బలైపోయాడా అంటే మాత్రం స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మనిషి మాంసం తినేందుకు అలవాటు పడ్డ సీకి తగిన శిక్షే పడిందని కొంతమంది చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం అతడు అమాయకుడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సీ ఎవరు? అరవై ఏళ్ల తర్వాత అతడి మృతదేహాన్ని దహనం చేసేందుకు దారి తీసిన పరిస్థితులేమిటి?
చైనా నుంచి వలస వచ్చి..
స్థానిక మీడియా వివరాల ప్రకారం.. చైనాకు చెందిన సీ ఓయే తన దేశం తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జపనీస్ సేనలు తమ సైన్యాన్ని చుట్టముట్టిన వేళ ఎలాగోలా తప్పించుకున్న అతడు ఆకలికి తట్టుకోలేక తోటి సైనికుల మృతదేహాలను తిన్నాడు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం పందొమిదేళ్ల వయసులో 1946లో థాయ్‌లాండ్‌కు వలస వచ్చి ఓ ఇంట్లో తోటమాలిగా పనికి కుదిరాడు. ఈ క్రమంలో 1958లో రేయాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో ఎనిమిదేళ్ల బాలుడి శవాన్ని దహనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కిడ్నాపైన ఆ బాలుడి శరరీంలో కొన్ని అవయవాలు మిస్పయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఘటన జరగడానికి నాలుగేళ్ల ముందు అంటే 1954లో వివిధ ప్రాంతాల్లో కిడ్నాపైన ఐదుగురు పిల్లల హత్యకు సంబంధించి.. పెండింగ్‌లో ఉండిపోయిన కేసులకు కూడా సీనే కారణమని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. (5,232 మంది హత్యకు సాయం.. రెండేళ్ల శిక్ష)
చిన్న పిల్లల గుండె, కాలేయం తినేవాడు
ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా.. చిన్న పిల్లలను హతమార్చి వారి గుండె, కాలేయం, పేగులు తినడం తనకు అలవాటు అని సీ వెల్లడించినట్లు మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 1959లో ముప్పై రెండేళ్ల వయసులో సీనిని కాల్చి చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని పరిశోధనల నిమిత్తం సిరిరాజ్ ఆస్పత్రికి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడి ఫోరెన్సిక్ మ్యూజియంలో గాజు గ్లాసులో ‘‘కానిబెల్(స్వజాతి మాంసాన్ని భక్షించేవాడు)’’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు. ఇక అప్పటి నుంచి సీ జీవితం ఆధారంగా ఎన్నో హారర్ సినిమాలు తెరకెక్కాయి. పుస్తకాల్లో అతడి కథ గురించి కొంతమంది రచయితలు ప్రస్తావించారు. అయితే ఈ కేసుల్లో నిజంగానే సీ నిజంగానే దోషి అనడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఆధారాలు లభించలేదు.
కఠిన చర్యలు.. అరవై ఏళ్ల తర్వాత అంత్యక్రియలు
ఈ నేపథ్యంలో అందరు పిల్లల్లాగానే తాను కూడా సీ ఓయే గురించి బాల్యంలో కథలు విన్న ఫరా చక్రపత్రనన్ అనే వ్యక్తికి మాత్రం ఎందుకో ఈ విషయాలు నమ్మబుద్ధికాలేదు. చైనా- థాయ్‌లాండ్ మధ్య శత్రుత్వం కారణంగా థాయ్ మిలిటరీ ప్రభుత్వం అప్పట్లో చైనీస్ వలసదారులను అకారణంగా శిక్షలకు గురిచేసేదని, జైలులో బంధించేదనే కథనాలు.. ఫరాను సీ గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేశాయి. అంతేగాకుండా మిస్సయిన పిల్లలంతా ఒకే విధంగా చనిపోలేదనే విషయం కూడా అతడి మెదడును తొలచివేసింది. ఏదేమైనా చేసిన తప్పునకు శిక్ష అనుభవించాడు కాబట్టి సీని ‘కానిబెల్’ అని పేర్కొంటూ ఇంకా అతడి మృతదేహాన్ని మ్యూజియంలో ఉంచడం సరైన చర్య కాదని భావించాడు.
అందుకే.. చనిపోయిన వ్యక్తికి కనీసం శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకోవాలంటూ 2018లో ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందుకు మరికొంత మంది కూడా తోడు కావడంతో సిరిరాజ్ ఆస్పత్రి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని గతేడాది జూన్‌లో కానిబెల్ ట్యాగ్‌ను తొలగించి.. ఆగస్టులో సీ మృతదేహాన్ని మ్యూజియం నుంచి వేరే చోటుకు మార్చింది. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం గురువారం ఎట్టకేలకు సీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. తొమ్మిది మంది బౌద్ధ సన్యాసుల సమక్షంలో సీ శవపేటిక ముందు మంత్రాలు పఠిస్తూ, కాగితపు పూలు జల్లి శ్మశానానికి తరలించారు. కరెక్షన్ డిపార్ట్‌మెంట్ హెడ్ అతడి శవానికి నిప్పు అంటించారు.
సీ ఓయే అమాయకుడు
ఈ విషయం గురించి ఫరా మాట్లాడుతూ.. ‘‘నేను మ్యూజియంకు వెళ్లినపుడు అతడిని చూశాను. అప్పటి వరకు ఓ మాన్ ఈటర్‌గానే తను నాకు తెలుసు. కానీ ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అతడు ఓ బాధితుడు అనిపించింది. నేరం చేశాడో లేదో తెలియదు గానీ గాజు గ్లాసులో దశాబ్దాల తరబడి బొమ్మగా మిగిలిపోయాడు. అతడి హక్కులు హరించివేయబడ్డాయి అనిపించింది. అందుకే ఈ పిటిషన్ దాఖలు చేశా’’ అని చెప్పుకొచ్చారు.
ఇక సీ ఓయేకు తోటమాలిగా పని ఇచ్చిన దంపతుల కూతురు వనప్ప తాంగ్‌చిన్.. తన కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం సీ ఓయే ఓ అమాయకుడని పేర్కొన్నారు. అతడిని తమ కుటుంబంలో ఒకడిగా భావించేవారని.. అంతటి హేయమైన నేరానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోయామని చెప్పుకొచ్చారు. తమ గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, ఎట్టకేలకు అతడి అంత్యక్రియలు నిర్వహించడం ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment