వాషింగ్టన్: అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలైమని మృతికి ప్రతీకారంగా అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి కూల్చేస్తామనే ఆడియో మెసేజ్ కలకలం సృష్టించింది. సోమవారం ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీల మధ్యలో ఈ మెసేజ్ వినిపించింది. దీంతో ఎఫ్‌బీఐ, ఎఫ్‌ఏఏలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయని సీబీఎస్ సంస్థ తెలిపింది. ‘బుధవారం మేము క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి ధ్వంసం చేస్తాం. సొలైమని మృతికి ప్రతీకారం తప్పదు’ అని ఎవరూ గుర్తుపట్టకుండా డిజిటైజ్డ్ వాయిస్‌తో ఈ మెసేజ్ రికార్డు చేశారు. బుధవారం ఈ బిల్డింగ్‌లో యూఎస్ కాంగ్రెస్ సమావేశమై బైడెన్ గెలుపును ధ్రువీకరించనుంది. 2020 జనవరి 3న సొలైమని మిస్సైల్ దాడిలో మరణించారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత సొలైమని మృతికి ప్రతీకారమంటూ మెసేజ్ వినిపించడం రక్షణ వర్గాల్లో కలకలం సృష్టించింది. సొలైమని మరణం ఇరాన్‌లో తీవ్ర భావావేశాలు రేకెత్తించింది. ఇందుకు ప్రతిగా ఇరాక్‌లో పలుమార్లు పలువురు యూఎస్ వ్యక్తులపై, ఎంబసీపై దాడులు జరిగాయి. ఇరాన్ కోర్టులు ట్రంప్ సహా పలువురు యూఎస్ అధికారులపై అరెస్టు వారెంటులు జారీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment