
బాలుడిని ఆస్పత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది (ఫొటో కర్టెసీ: ఏపీ)
కాన్‌బెర్రా: ఇంటి నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడు మూడు రోజుల తర్వాత పోలీసులకు దొరికిన ఘటన ఆస్ట్రేలియాలోని ఉత్తర సిడ్నీలో చోటు చేసుకుంది. బాలుడికి బుద్ధిమాంద్యం సమస్య ఉన్నప్పటికీ మూడు రోజుల పాటు అడవిలో జీవించడం పోలీసులను సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆశ్చర్యపరచింది.
బుద్ధిమాంద్యం సమస్యతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు ఆంతోనీ ఏజే ఎల్‌ఫలక్ మూడు రోజుల క్రితం తప్పిపోయాడు. తల్లిదండ్రులతో పాటు నివసిస్తున్న పుట్టీ అనే గ్రామం కారడవికి చాలా దగ్గర్లో ఉంటుంది. గ్రామంలోని ఇంటి నుంచి బాలుడు తప్పిపోయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సహా వందలాది మంది అడవిలో అన్వేషణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్న పోలీసులకు బాలుడి జాడ కనిపించింది. చెట్ల మధ్యలో నీటి మడుగు వద్ద కూర్చొని నీరు తాగుతున్న బాలున్ని కెమెరాల ద్వారా గుర్తించారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని చీమలు కుట్టాయని, శరీరంపై గీక్కుపోయిన గాయాలున్నాయని వెల్లడించారు.
తమ కుమారుడి ఆచూకీ తెలియడంతో బాలుడి తల్లిదండ్రుల భావోద్వేగం (ఫొటో కర్టెసీ: ఏపీ)
ఇంటికి 470 మీటర్ల దూరంలో బాలుడు దొరికాడన్నారు. తల్లి గొంతు వినగానే బాలుడు కళ్లు తెరచి చూశాడని అనంతరం ప్రశాంతంగా నిద్రపోయాడని పేర్కొన్నారు. కేవలం ఓ టీ–షర్ట్, డైపర్‌తో తప్పిపోయిన బాలుడు మూడు రోజుల పాటు అడవిలో జీవించి ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పోలీసులు అన్నారు. నీటిని గుర్తించగలిగే సామర్థ్యం కారణంగా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండగలిగాడని చెప్పారు. రక్షించేందుకు వెళ్లిన తనను చూసి బాలుడు చిరునవ్వు చిందించడం ఎన్నటికీ మరువలేనని పోలీస్ చీఫ్ సీమోన్ మెరిక్ అన్నారు. బాలుడు దొరకడం గొప్ప అద్భుతమని బాలుడి తండ్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment