వాషింగ్టన్ : అమెరికాను వణికిస్తోన్న కరోనా మహమ్మారి వైట్ హౌస్ లో ప్రకంపనలు రేపుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లెర్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన వైట్ హౌస్ సిబ్బంది సంఖ్య 10కి చేరినట్టు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ రిమోట్ గా విధులు నిర్వహిస్తున్న తనకు రోజూ నెగిటివ్ వచ్చినా, తాజాగా కరోనా నిర్ధారణ అయిందని మిల్లెర్ మంగళవారం వెల్లడించారు. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్టు పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిల్లెర్ భార్య కేటీ మిల్లర్‌కు గతంలో వైరస్ వచ్చింది.
కాగా ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా నిర్ధారణైన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు గత వారం కరోనా బారిన పడినట్టు గుర్తంచారు. ఈ మేరకు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ట్రంప్ ఈ సోమవారం సోమవారం డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీ, ముగ్గురు సిబ్బంది కూడా పాజిటివ్ పరీక్షించారు. అలాగే వైట్ హౌస్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు పాత్రికేయులకు కూడా వైరస్ సోకింది. దీంతో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. పీపీఈ కిట్లను ధరించడం లాంటి జాగ్రత్తలతోపాటు ట్రంప్ కుటుంబంతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్న సిబ్బందికి ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 7.53 మిలియన్లుగా ఉండగా, మరణించిన వారి సంఖ్య రెండు లక్షలను అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment