వాషింగ్టన్: అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి మరి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు 290 మిలియన్ డాలర్ల(21,25,29,40,000 రూపాయలు) విలువ చేసే 3 వేల స్మార్ట్ బాంబుల అమ్మకానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ఓ నోటీసును విడుదల చేసింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటీసు ప్రకారం సౌదీ అరేబియాకు 3 వేల బోయింగ్ నిర్మిత జీబీయూ -39 స్మాల్ డయామీటర్ బాంబ్ ఐ (ఎస్‌డీబీ ఐ) ఆయుధాలు, సంబంధిత పరికరాలను విక్రయించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ నిర్ణయం ట్రంప్ పదవీకాలం చివరి రోజుల్లో వస్తుంది. అయితే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి కారణమైన యెమెన్‌లో యుద్ధాన్ని ముగించాలని రియాద్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలను నిలిపివేస్తామని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం గమనార్హం. ఇక మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ ఆయుధాలను భారీగా కొనుగోలు చేసేది సౌదీ అరేబియానే. (చదవండి: కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం)
"డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ రోజు అమ్మకం గురించి కాంగ్రెస్‌కు తెలియజేస్తూ అవసరమైన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది" అని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటైనర్లు, సహాయక పరికరాలు, సేవలు, విడి, మరమ్మతు భాగాలతో కూడిన జీబీయూ -39 ఎస్‌డీబీ ఐ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రతిపాదిత అమ్మకం "మధ్యప్రాచ్యంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న స్నేహపూర్వక దేశం భద్రతను" మెరుగుపరచడానికి సహాయపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment