ట్రంప్‌కు కరోనాపై సెటైర్లు : ట్విటర్ హెచ్చరిక  | Tweets wishing for death of hospitalised Trump are not allowed says Twitter | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కరోనాపై సెటైర్లు : ట్విటర్ హెచ్చరిక 

Published Sat, Oct 3 2020 2:55 PM | Last Updated on Sat, Oct 3 2020 3:14 PM

Tweets wishing for death of hospitalised Trump are not allowed says Twitter - Sakshi

వాషింగ్టన్ : కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై  ట్విటర్ వేదికగా సెటైర్లు, అనుచిత కమెంట్ల వెల్లువ కురుస్తోంది. దీనిపై స్పందించిన ట్విటర్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌పై  నోటి దురుసును ప్రదర్శించిన యూజర్ల  ఖాతాలను నిలిపివేస్తామని ట్వీట్ చేసింది. మరణం, తీవ్రమైన శారీరక హాని, ఎవరికైనా ప్రాణాంతక వ్యాధి రావాలని కోరుకోవడం లాంటి ట్వీట్లను సహించం. తక్షణమే వాటిని తొలగిస్తామని వెల్లడించింది. ఒక వ్యక్తి మరణం కోరుకునే ట్వీట్లు తమ నిబంధనలకు విరుద్ధమని, ఈ విధానం వినియోగదారులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్నింటిని సస్పెండ్ చేస్తున్నట్లు ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది.  (కరోనా : ట్రంప్‌నకు మరో దెబ్బ)

కరోనా సోకిన ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ట్వీట్  చేశారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి జోబైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ట్రంప్ త్వరగా కోలుకోవాలని అభిలషించారు. అయితే ట్విటర్ యూజర్లు మాత్రం తరచూ నోటి దురుసు ప్రదర్శించే ట్రంప్‌పై అదే స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యోక్తులతోపాటు  మీమ్స్ షేర్ చేస్తూ చాలామంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ హ్యాజ్ కోవిడ్ హ్యాష్ ట్యాగ్  తెగ వైరల్ అవుతోంది. అటు ట్రంప్‌ దంపతులకు కరోనా సోకిన విషయానికి చైనా అధికారిక మీడియా కూడా  భారీ ప్రధాన్యమే ఇస్తోందట. (త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ)

‘అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కొత్త నాటకానికి (సర్కస్‌)కు తెరతీశారు’ అంటూ ఒకరు, మొత్తానికి ట్రంప్ ఒక పాజిటివ్ వార్తను ట్వీట్ చేశారంటూ గూనర్ అనే మరొకరు  చేయగా, ‘దేవుడా.. దేవుడా.. మీరు మాకు కావాలి.. ఆయన్ని కాపాడండి, ప్లీజ్’ అంటూ మరో యూజర్ సెటైర్ వేశారు. ప్రధానంగా కోల్ గోర్మన్ అనే నెటిజన్ చేసిన ఓ ట్వీట్‌ మాత్రం తెగ వైరల్‌ అవుతోంది. ఆ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కొవిడ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ వైరస్‌కు చివరికి ఎలాంటి గతి పట్టింది. అది త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కరోనా రూపంలో ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బపడింది. ట్రంప్, ఆయన సతీమణి మెలనియా కరోనా బారిన పడటమే కాదు, ప్రధాన సలహదారు, ఒక  సెనేటర్, ఆయన ప్రధాన ప్రచార నిర్వాహకుడికి కూడా  వైరస్ సోకింది. దీంతో ప్రచార కార్యక్రమాలకు వీరు తాత్కాలింగా దూరంకానున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement