
Holding Kalashnikov: ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తాను సైతం యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పారు.
మహిళలు పురుషులు అనే భేధం లేకుండా ఈ నేలని రక్షించుకుంటారని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాను చాలా కోపంగా ఉన్నానని చెప్పారు. అయినా పుతిన్ ఉక్రెయిన్ ఉనికి హక్కును ఎలా తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదనగా పేర్కొన్నారు. తనని తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని అయినప్పటికీ తాను రాజధాని కైవ్‌లోనే ఉంటూ తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకుంటానని చెబుతున్నారు. ఉక్రెయిన్ స్వతంత్ర దేశం అని తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ధీమాగా చెప్పారు.
తన తోటి శాసనసభ్యులతో సహా అనేక మంది ఉక్రేనియన్ మహిళలు రష్యా దళాలతో పోరాడేందుకు ఆయుధాలు తీసుకున్నారని ఉక్రెయిన్ ఎంపీ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఊహకు కూడా అందని విధంగా తాము ప్రతిఘటిస్తాం అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కాదు కదా మా గడ్డ మీద ప్రతి అంగుళాన్ని వారికి దక్కనివ్వకుండా మా దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌లోని ప్రతి స్త్రీ, పురుషుడు సిద్ధంగా ఉన్నారన్నారు.
"మేము ఈ యుద్ధం ప్రారంభించలేదు, మేము మా దేశంలో మా జీవితాలను శాంతియుతంగా జీవిస్తున్నాము, మన దైనందిన జీవితాన్ని అగాధంలో పడేసేలా శత్రువు మా దేశంలోకి చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ కూర్చొం. దేశాన్ని రక్షించే క్రమంలో ఆయుధాలు ధరించాల్సిన అవసరం లేని నాలాంటి వ్యక్తులు సైతం నిలబడి పోరాడతారు. పుతిన్ తమ బలగాలను వెనక్కి రప్పిస్తాడని ఆశిస్తున్న" అని ఉక్రెయిన్ ఎంపీ రుడిక్ అన్నారు.
(చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం)
Comments
Please login to add a commentAdd a comment