సోషల్ మీడియా నుంచి ఎస్‌ఎంఎస్‌ల వరకూ దేనిలోనైనా మన భావోద్వేగాలను ఎదుటివారికి తెలియజేయాలంటే వెంటనే గుర్తొచ్చేది ఎమోజీలు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వీటి వినియోగం ఎక్కువైపోయింది. ముఖ్యంగా వాట్సాప్‌లో చాటింగ్ చేసేటప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. సంతోషం, ప్రేమ, అసూయ.. బాధఇలా రకరకాల ఎన్నో భావాలను ఒక్క ఎమోజీతో వ్యక్తపరచవచ్చు. మాట్లాడే అవసరంలేకుండా భావోద్వేగాల్ని ఎమోజీల రూపంలో వ్యక్తపరుస్తుంటారు.
సాక్షి, అమరావతి: ఎమోజీలు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్‌ల్లో ఎన్ని అప్‌డేట్‌లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటున్నాయి. అవతలి వాళ్లు ఎంత పెద్ద మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా దాగి ఉంది. స్పష్టమైన భావోద్వేగాలను వ్యక్తీకరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువ మేర వాడిన ఎమోజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. స్వచ్ఛంద సంస్థ ‘యూనికోడ్ కన్సార్టియం’ 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎమోజీల సమాచారాన్ని విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 92 శాతం మంది ఆన్‌లైన్ యూజర్లు ఎమోజీలు వినియోగిస్తున్నట్లు యూనికోడ్ కన్సార్టియం నివేదిక తెలిపింది.
ఎక్కువగా వాడే ఎమోజీలు ఇవే...
యూనికోడ్ కన్సార్టియం నివేదిక ప్రకారం.. ‘ఆనంద బాష్పాలు’ (‘టియర్స్ ఆఫ్ జాయ్) మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఎమోజీల కంటే దీనిని 5 శాతం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఇక రెండో స్థానంలో హార్ట్ (హృదయం), మూడో స్థానంలో ‘రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ లాఫ్’ (నేలపై పడిపడి నవ్వుతూ), నాలుగులో థంబ్సప్ (బొటన వేలు పైకి చూపుతూ), ఐదులో లౌడ్లీ క్రయింగ్ (బిగ్గరగా ఏడుస్తూ) ఎమోజీలున్నాయి. తొలి 10 ఎమోజీల్లో మిగిలినవి వరుసగా ఫోల్డెడ్ హ్యాండ్స్ (ప్రార్థిస్తున్న చేతులు), ఫేస్ బ్లోయింగ్ ఏ కిస్ (గాలిలో ముద్దిస్తూ), స్మయిలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ (ప్రేమను కురిపించే చిరునవ్వు), స్మయిలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ఐస్ (కళ్లలో ప్రేమ), పార్టీ పాపర్(రంగుల కాగితాలు విరజిమ్మే టపాసు) ఎక్కువ ఉందిని ఆకట్టుకున్నాయి.
200 స్థానాల్లో భారీ మార్పులు
ఇక వర్గాల వారీగా చూస్తే ఫ్లాగ్ (జెండాలు) 258 రకాలతో పెద్ద సమూహంగా ఉన్నప్పటికీ చాలా తక్కువగా వినియోగించారు. రాకెట్, షిప్ ఎమోజీ ట్రాన్స్‌పోర్ట్–ఎయిర్ సబ్‌సెట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. శరీర భాగాల్లో కండలు చూపించే ఎమోజీ తొలి స్థానం దక్కించుకుంది. చిరునవ్వు, చేతులు, మొక్కలు, పువ్వుల ఎమోజీలను తరచుగా ఉపయోగిస్తున్నారు. జంతువులు–ప్రకృతి వర్గం 53 ఎమోజీలతో రెండో అతిపెద్ద సమూహంగా ఉండగా వీటిల్లో బొకే, సీతాకోకచిలుకకు మంచి ఆదరణ లభిస్తోందని నివేదిక పేర్కొంది.
2019 నివేదికతో పోలిస్తే 200 స్థానాల్లో భారీ మార్పులు వచ్చాయని తెలిపింది. గతంలో 113 స్థానంలో ఉన్న బర్త్‌డే కేక్ 25వ స్థానానికి, 139వ స్థానంలో ఉన్న బెలూన్ 48కి, ప్లీడింగ్ ఫేస్ (వేడుకునే ముఖం) ఎమోజీ 97 నుంచి 14వ స్థానానికి ఎగబాకింది. ఆరోగ్యానికి సంబంధించి హాట్, వాజీ ఫేస్ ఎమోజీలు మాత్రమే టాప్ 100లో ఉన్నాయి. ఇక మాస్ వేర్ మాస్క్ ఎమోజీ 186 నుంచి 156వ స్థానానికి వచ్చింది.
176తో ప్రారంభమై.. 3,663కు చేరిక
ఈ సంస్థ భాషకు సాంకేతిక లిపిని అందించేందుకు ఇంటర్నేషనల్ బై డైరెక్షనల్ అల్గారిథమ్ అభివృద్ధి, నిర్వహణను ప్రోత్సహిస్తోంది. కంప్యూటర్, సమాచార ఆధారిత పరిశ్రమకు చెందిన విభిన్న వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా సభ్యత్వ రుసుము మీదే ఆధారపడి నడుస్తుంది. ఇందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి శాశ్వత సభ్యత్వం కూడా ఉంది.
యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే ఎమోజీలను విడుదల చేస్తారు. ఎమోజీలను మొదటగా జపాన్‌కు చెందిన ఇంటర్‌ఫేస్ డిజైనర్ షిగేటకా కురిటా 1999లో అభివృద్ధి చేశారు. 176 చిహ్నాలతో ప్రారంభమైన ఈ భాష..నేడు 3,663 ఎమోజీలకు చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో 44 కోట్ల మందికిపైగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఏపీ జనాభాలో 31% మందికి పైగా ఆన్‌లైన్ యూజర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment